
ఐపీఎల్ మొదలవడానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ అభిమానులకు ఉత్సాహం పంచింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ అన్‌బాక్స్ ఈవెంట్‌లో వందలాది మంది అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్సీబీ స్టార్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్ అందరూ కూడా స్టేడియంలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఆటగాళ్ల ప్రాక్టీస్ సెషన్స్‌కు ఆర్సీబీ అభిమానులను అనుమతించిన సంగతి తెలిసిందే.
నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసేందుకు అందరి కన్నా ముందు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ వెళ్లాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇద్దరూ ఏదో విషయం గురించి తెగ చర్చించుకున్నారు. సిరాజ్ కెమెరాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. సంజయ్ బంగర్ సహా కోచ్‌లు తమ ఆటగాళ్లకు కొన్ని సూచనలు చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే బ్యాక్‌గ్రౌండ్‌లో డీజే సాంగ్స్ వేయడంతో అభిమానులు అందరూ తెగ సంతోషించారు. ఈ కార్యక్రమం కోసం ఆర్సీబీ లెజెండ్స్ క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్ కూడా స్టేడియానికి చేరుకున్నారు.
ఆర్సీబీ అన్‌బాక్స్ వేడుకల్లో భాగంగా తమ జట్టు తరఫున ఆడిన లెజెండరీ ప్లేయర్లను ఈ ఫ్రాంచైజీ యాజమాన్యం సత్కరించనుంది. గేల్, డివిల్లీర్స్ ఇద్దరినీ ఆర్సీబీ 'హాల్ ఆఫ్ ఫేమ్'లో చేర్చాలని నిర్ణయించింద. అంతేకాదు, ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు ధరించిన జెర్సీ నెంబర్లను కూడా రిటైర్ చేయిస్తున్నట్లు ఆర్సీబీ ప్రకటించింది. డివిల్లీర్స్ తన కెరీర్‌లో 17వ నెంబర్ జెర్సీ ధరించగా.. క్రిస్ గేట్ 333 నెంబర్ జెర్సీ వేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రెండు నెంబర్లకు రిటైర్‌మెంట్ ఇస్తున్నారు.
కరోనా కారణంగా 2019 నుంచి ఐపీఎల్‌లో హోం, ఎవే ఫార్మాట్‌ను నిలిపి వేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది మళ్లీ ఈ ఫార్మాట్లో మ్యాచులు జరగనున్నాయి. దీంతో తమ అభిమానులను ఐపీఎల్ కన్నా ముందే పలకరించాలని ఆర్సీబీ భావించింది. అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో కోహ్లీ సహా ఆర్సీబీ స్టార్ ఆటగాళ్లు ఫ్యాన్స్‌తో ముచ్చటించారు. ఆ తర్వాత హర్షల్ పటేల్ తన గిటార్ స్కిల్స్‌తో అభిమానులను అలరించాడు.