
ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాలని చూస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి మరో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నో అంచనాలతో కొనుగోలు చేసిన విల్ జాక్స్ గాయం కారణంగా ఐపీఎల్ 16వ సీజన్‌కు దూరమయ్యాడు. అలాగే ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా గాయాలతో పూర్తిగా ఐపీఎల్ ఆడేలా లేరు. ఈ వార్తలతో ఆందోళన చెందుతున్న ఆర్సీబీ అభిమానులకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
ఆర్సీబీలో కీలకంగా మారిన యువ బ్యాటర్ రజత్ పటీదార్.. గాయం కారణంగా సగం ఐపీఎల్‌కు దూరమయ్యేలా ఉన్నాడు. గతేడాది వికెట్ కీపర్ బ్యాటర్ లువ్‌నిత్ సిసోడియా గాయం కారణంగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. దీంతో అతని రిప్లేస్‌మెంట్‌గా రజత్ పటీదార్‌ను ఆర్సీబీ తీసుకుంది. కోహ్లీ, డుప్లెసిస్ ఓపెనర్లుగా రావడంతో.. పటీదార్ మూడో స్థానంలో చెలరేగాడు. అద్భుతంగా రాణించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ముఖ్యంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్‌లో సెంచరీతో చెలరేగాడు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది ఐపీఎల్‌లో ఆర్సీబీకి పటీదార్ కూడా చాలా కీలకంగా మారతాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు అతనికి కూడా గాయమైనట్లు తెలుస్తోంది. కొన్నిరోజుల క్రితమే చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ జట్టు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో పటీదార్ పాల్గొనలేదు. పటీదార్ మడమకు గాయం అవడంతో అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీయే)లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ గాయం కారణంగా అతనికి కనీసం మూడు వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు తెలిపారట.
మూడు వారాల రెస్ట్ అంటే.. ఐపీఎల్ మొదటి అర్ధభాగంలో పటీదార్ ఆడటం జరగదు. అంతేకాదు, ఈ మూడు వారాల తర్వతా ఎంఆర్ఐ స్కార్ తీయాలని, ఆ తర్వాతనే అతను ఆడటంపై నిర్ణయం తీసుకుంటామని ఎన్సీయే వైద్యులు అంటున్నారు. దీంతో ఆ తర్వాత కూడా పటీదార్ వెంటనే ఆడతాడని చెప్పలేం. ఇప్పటికే విల్ జాక్స్ ఈ ఐపీఎల్‌కు దూరమవగా.. మ్యాక్స్‌వెల్, జోష్ హాజిల్‌వుడ్ కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో పటీదార్ కూడా జట్టుకు దూరమవడం కచ్చితంగా ఆర్సీబీకి ఎదురు దెబ్బే అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.