ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. అయితే గత 17 సీజన్లుగా ప్రతిసారి ఫేవరేట్‌గా బరిలోకి దిగి కప్‌ను అందుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
తొలిసారి స్టార్ ప్లేయర్ల కోసం పోటీపడకుండా పటిష్టమైన తుదిజట్టు నిర్మాణం కోసం ఆర్సీబీ తీవ్రంగా శ్రమించింది. గతంలో స్టార్లను నమ్ముకుని టైటిల్‌ను అందుకోలేకపోయిన బెంగళూరు మేనేజ్మెంట్ తమ ప్రణాళికలను మార్చుకుంది. స్పష్టమైన వ్యూహాలతో మిడిలార్డర్‌ను బలోపేతం చేసింది. పవర్‌ప్లేలో వికెట్లు సాధించేలా అనుభవం ఉన్న పేసర్లను తీసుకుంది. డెత్ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్లను సొంతం చేసుకుంది. స్పిన్‌ను బలోపేతంగా మార్చుకుంది. ఫినిషర్లను వేలంలో సొంతం చేసుకుంది.

దూకుడుగా వ్యవహరించకుండా మెగా వేలంలో ఏకంగా రూ.75 లక్షలను మిగిల్చుకుంది. రెండు ఆర్‌టీఎమ్‌లను ఉపయోగించనే లేదు. అయితే మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, విల్ జాక్స్‌లను ఆర్‌టీఎమ్‌తో ఆర్సీబీ సొంతం చేసుకోలేదనే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. కానీ బెంగళూరు ఫ్రాంచైజీ స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగిందని, అందుకే మాజీలను తిరిగి దక్కించుకోలేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విరాట్ కోహ్లి-ఫిలిప్ సాల్ట్-రజత్ పటిదార్‌లతో ఆర్సీబీ టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. టాప్ ఆర్డర్‌కు బ్యాకప్‌గా దేవదత్ పడిక్కల్ ఉన్నాడు. లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్య, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్‌లతో మిడిలార్డర్ బలోపేతంగా మారింది. జితేశ్, డేవిడ్ ఫినిషర్ల పాత్రను పోషించనున్నారు. మిడిలార్డర్‌కు బ్యాకప్‌గా జాకోబ్ బెథెల్, రోమెరియా షెఫార్డ్ ఉన్నారు. ఇక పవర్‌ప్లే బాధ్యతలు అనుభవజ్ఞులు భువనేశ్వర్, హేజిల్‌వుడ్ అందుకోనున్నారు. మిడిల్-డెత్ ఓవర్ల బాధ్యతలను రసిక్ సలామ్, యశ్ దయాల్ చూసుకోనున్నారు. కృనాల్ పాండ్యతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సుయాశ్ శర్మ స్పిన్నర్లుగా కొనసాగనున్నారు. అంతిమంగా విరాట్ కోహ్లి తిరిగి సారథి బాధ్యతలు అందుకోనున్నాడు.
ఆర్సీబీ బెస్ట్ ప్లేయింగ్ ఎలవెన్: విరాట్ కోహ్లి (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, రజత్ పటిదార్, లివింగ్‌స్టోన్, కృనాల్ పాండ్య, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్,రసిక్ సలాం, యశ్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్: సుయాశ్ శర్మ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ధర- రూ.కోట్లలో)
విరాట్ కోహ్లి (21), జోస్ హేజిల్‌వుడ్ (12.50), ఫిలిప్ సాల్ట్ (11.50), జితేశ్ శర్మ, రజత్ పటిదార్ (11), భువనేశ్వర్ (10.75), లివింగ్‌స్టన్ (8.75), రసిక్ సలాం (6), కృనాల్ పాండ్య (5.75), యశ్ దయాల్ (5), టిమ్ డేవిడ్ (3), బెతెల్, సుయాశ్ శర్మ(2.60), దేవదత్ పడిక్కల్ (2), నువాన్ (1.60), షెఫర్డ్ (1.50), ఎంగిడి (1), స్వప్నిల్ (0.50), స్వస్తిక్, మనోజ్, అభినందన్, మోహిత్ (0.30)