టీ20 క్రికెట్‌లో రోజు రోజుకూ బ్యాటింగ్ విధ్వంసాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇంగ్లండ్ బ్యాటర్ విల్ జాక్స్ కూడా బ్యాటుతో రెచ్చిపోయాడు. గాయం కారణంగా ఐపీఎల్ మిస్ అయిన అతను ప్రస్తుతం టీ20 బ్లాస్ట్‌లో అదరగొడుతున్నాడు. సర్రే తరఫున ఆడుతున్న అతను.. మిడిలెసెక్స్ మ్యాచ్‌లో చెలరేగాడు. ఏకంగా 7 సిక్సర్లు, 8 ఫోర్లు బాదాడు. అయితే సెంచరీకి ఒక్క షాట్ దూరంలో పెవిలియన్ చేరాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సర్రేకు విల్ జాక్స్ అదిరిపోయే ఆరంభం అందించాడు. అతనితోపాటు మరో ఓపెనర్ లారీ ఇవాన్స్ కూడా చెలరేగాడు. జాక్స్ కేవలం 45 బంతుల్లోనే 96 పరుగులతో మెరవగా.. ఇవాన్స్ కూడా 37 బంతుల్లో 85 రన్స్ చేశాడు. ముఖ్యంగా 11వ ఓవర్లో జాక్స్ రెచ్చిపోయాడు. వరుసగా ఐదు సిక్సర్లతో చెలరేగాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో అతన్ని ఆర్సీబీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కానీ గాయం వల్ల అతను ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

మిగతా బ్యాటర్లు ఫెయిలైనా చివర్లో సర్రే కెప్టెన్ క్రిస్ జోర్డాన్ (7 బంతుల్లో 16 నాటౌట్) కూడా భారీ షాట్లు ఆడాడు. దీంతో సర్రే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 252 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో మిడిలెసెక్స్ కూడా అదరగొట్టింది. ఆ టీం ఓపెనర్లు స్టీఫెన్ ఎస్కినాజి (73), జో క్రాక్‌నెల్ (36) జట్టుకు శుభారంభం అందించారు. ధనాధన్ షాట్లతో సర్రే బౌలర్లపై విరుచుకుపడ్డారు. తర్వాత వచ్చిన మ్యాక్స్ హోల్డన్ (68 నాటౌట్), ర్యాన్ హిగ్గిన్స్ (48) కూడా అద్భుతంగా రాణించారు.
ఈ మ్యాచ్‌లో సర్రే బౌలర్లు గాడి తప్పి ఏకంగా 18 ఎక్స్‌ట్రాలు సమర్పించారు. ఈ క్రమంలో భారీ స్కోరు చేసినా కూడా సర్రేకు ఓటమి తప్పలేదు. మిడిలెసెక్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలుండగానే కేవలం మూడు వికెట్ల నష్టానికే 254 పరుగులు చేసింది. దీంతో విల్ జాక్స్, ఇవాన్స్ వీరోచిత ఇన్నింగ్స్‌లు వృధా అయ్యాయి. సర్రే బౌలర్లలో కెప్టెన్ జోర్డాన్ మాత్రమే రెండు వికెట్లు తీసుకోగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.