
మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా నాలుగో మ్యాచులోనూ ఓటమిపాలైంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ ఏమాత్రం ఆకట్టుకోలేదు. బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో ఆర్సీబీ అనుకున్నంత భారీ స్కోరు చెయ్యలేకపోయింది.
లక్ష్య ఛేదనలో యూపీ ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ అలీసా హేలీ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించింది. దీంతో ఆ జట్టు పది వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన (4) ఈ మ్యాచ్‌లో కూడా విఫలమైంది. అయితే సోఫీ డివైన్ (36), ఎలీస్ పెర్రీ (52) ఇద్దరూ రాణించారు. కానీ ఆ తర్వాత వచ్చిన కణికా అహూజా (8), హెదర్ నైట్ (2) ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమయ్యారు. శ్రేయాంక పాటిల్ (15), ఎరిన్ బర్న్స్ (12) క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినా ఆ వెంటనే అవుటయ్యారు.
ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ (1) దారుణంగా విఫలమైంది. చివర్లో రేణుకా సింగ్ (3), కోమల్ జంజాద్ (6 నాటౌట్), సహానా పవార్ (0) ఏమీ చెయ్యలేకపోయారు. దీంతో బెంగళూరు జట్టు ఏ దశలోనూ భారీ స్కోరు చేసేలా కనిపించలేదు. యూపీ వారియర్జ్ బౌలర్లలో దీప్తి శర్మ, సోఫీ ఎక్సెల్‌టోన్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. రాజేశ్వరి గైక్వాడ్ ఒక వికెట్ తీసుకుంది. దీంతో 19.3 ఓవర్లలో 138 పరుగులకు ఆర్సీబీ ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో యూపీకి అదిరిపోయే ఆరంభం దక్కింది. కెప్టెన్ అలీసా హేలీ (96 నాటౌట్) చెలరేగి ఆడింది.
ఆమెతోపాటు ఓపెనింగ్ చేసిన దేవిక వైద్య (36 నాటౌట్) కూడా ఆచితూచి ఆడుతూ కెప్టెన్‌కు మంచి సహకారం అందించింది. హేలీ ఆటతీరు చూసిన అభిమానులు డబ్ల్యూపీఎల్‌లో తొలి శతకం నమోదవుతుందని భావించారు. కానీ 13వ ఓవర్లో దేవిక కూడా ఒక బౌండరీ కొట్టడంతో హేలీ సెంచరీ ఆశలు సన్నగిల్లాయి. ఆ ఓవర్ చివరి బంతికి ఆమె సింగిల్ తీయడంతో యూపీ వారియర్జ్ విజయం సాధించారు. కానీ ఆమె మాత్రం 96 పరుగుల వద్దనే ఉండిపోయింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బౌలర్లు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడం గమనార్హం.