
అదే ఫార్ములా కంటిన్యూ చేస్తారా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఓపెనర్‌గా రాణించిన ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ప్రస్తుత సారధి ఫాఫ్ డుప్లెసిస్ కూడా మంచి ఆటగాడే. వీళ్లిద్దరూ మంచి ఫామ్ అందుకుంటే ఆ జట్టుకు అద్భుతమైన ఓపెనింగ్‌లు అందించగలరు. గతేడాది కోహ్లీ అంత గొప్ప ఫామ్‌లో లేకున్నా వీళ్లిద్దరూ ఓపెనర్లుగా ఫర్వాలేదనిపించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది కూడా వీళ్లనే ఓపెనర్లుగా పంపాలని ఆర్సీబీ నిర్ణయిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోహ్లీ ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్ అందుకుంటుండగా.. అటు డుప్లెసిస్ కూడా గాడిలో పడుతున్నట్లే కనిపిస్తున్నాడు మరి.

కుర్రాడికి చోటిస్తారా?
ఆర్సీబీలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ అనూజ్ రావత్ కూడా ఉన్నాడు. గతేడాది సీజన్ ఆరంభంలో జట్టు ఓపెనర్‌గా అతనికి పలు అవకాశాలు ఇచ్చినా ఉపయోగించుకోలేకపోయాడు. జట్టుకు మంచి ఓపెనింగ్ అందించడం కోసం అనవసరమైన షాట్లు ఆడి వికెట్ పారేసుకొని విమర్శలపాలయ్యాడు. ఆ తర్వాత అతని స్థానంలో కోహ్లీని ఓపెనర్‌గా దింపింది ఆర్సీబీ యాజమాన్యం. ఈసారి కూడా సీజన్ ఆరంభంలో అనూజ్‌కు మళ్లీ అవకాశం ఇస్తారేమో చూడాలి. అయితే డీకే వంటి సీనియర్ కీపర్ ఉండగా.. జట్టులో అనూజ్‌కు చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.

కొత్త కెరటం..
రెండు సీజన్లుగా ఆర్సీబీతో కలిసి ప్రయాణిస్తున్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఫిన్ అలెన్. ఈ కివీ ప్లేయర్‌కు ఇప్పటి వరకు ఆర్సీబీ తరఫున ఆడే అవకాశం రాలేదు. అయితే న్యూజిల్యాండ్ తరఫున 160పైగా స్ట్రైక్ రేటులో అలెన్ చెలరేగాడు. ఇది చూసిన తర్వాత అతన్ని బెంచ్‌కే పరిమితం చేసే తప్పు ఆర్సీబీ చేయదనే అందరూ అనుకుంటున్నారు. కివీస్ ఓపెనర్‌గా రాణించిన అతను ఆర్సీబీకి కూడా ఓపెనర్‌గానే వస్తే.. డుప్లెసిస్, ఫిన్ అలెన్ మంచి జోడీ అనిపిస్తోంది. మూడో స్థానంలో కోహ్లీ ఉండనే ఉన్నాడు. ఈ మూడు జోడీల్లో బెంగళూరు జట్టు ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications












