
మహిళల ఐపీఎల్‌లో టైటిల్ కోసం పోటీ పడే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. దీనికోసం జరిగిన వేలంలో మొట్టమొదటి ప్లేయర్‌ను ఆర్సీబీనే కొనుగోలు చేసింది. టీమిండియా వైస్ కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన కోసం ముంబై ఇండియన్స్‌తో గట్టిగా పోటీ పడిన ఆర్సీబీ.. చివరకు రూ.3.4 కోట్లకు మంధానను కొనుగోలు చేసింది. వేలం ఆరంభంలో మంచి దూకుడు కనబరిచిన ఆర్సీబీ.. మొత్తం 18 మంది ప్లేయర్లను కొనుగోలు చేసింది.
స్మృతి మంధానతోపాటు ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎలీస్ పెర్రీని కూడా ఆర్సీబీ కొనేసింది. ఆమె కోసం రూ.1.7 కోట్లు ఖర్చు పెట్టింది. అలాగే డ్యాషింగ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్‌ను రూ.1.9 కోట్లకు, పేస్ బౌలర్ రేణుకా సింగ్‌ను రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఎవరూ ఊహించని విధంగా న్యూజిల్యాండ్ జట్టు సారధి సోఫీ డివైన్‌ను చాలా తక్కువ ధరకు ఆర్సీబీ కొనగలిగింది. ఆమె తన బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకే ఆర్సీబీకి దక్కింది. వేలం ముగిసిన తర్వాత ఆర్సీబీ పర్సులో ఇంకా రూ.10 లక్షలు మిగిలి ఉండటం గమనార్హం.
మొట్టమొదటిసారి జరగనున్న ఈ మహిళల ఐపీఎల్‌కు వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) అని బీసీసీఐ పేరు పెట్టింది. దీనిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు పోటీ పడుతున్నాయి. ఈ టోర్నీ మార్చి 4 నుంచి 26 వరకు జరుగుతుంది. దీని ఏర్పాట్లలో భాగంగానే ముంబై వేదికగా సోమవారం నాడు ప్లేయర్ల వేలం నిర్వహించారు. దీనిలో అన్ని ఫ్రాంచైజీలూ ఉత్సాహంగా పాల్గొన్నాయి.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి జట్టు:
స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిషా కసత్, ఇంద్రాణీ రాయ్, శ్రేయాంక పాటిల్, కణకా అహూజా, ఆశా శోభన, హెతర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెమ్నార్, కోమల్ జంజాద్, మేగన్ షూట్, సహానా పవార్,