రిటైన్ లిస్ట్‌ను సమర్పించడానికి గడువు ముగుస్తున్న వేళ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్, విధ్వంసకర వికెట్ కీపర్ బ్యాటర్ అయిన రిషభ్ పంత్ ఫ్రాంచైజీని వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతన్ని దక్కించుకోవాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ 31వ తేదీలోపు ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్‌ను సమర్పించాల్సి ఉన్న విషయం తెలిసిందే.
ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి.

అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. రిటెన్షన్ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అయితే అందని ద్రాక్షగానే మిగిలిన టైటిల్ కలను వచ్చే సీజన్‌లో నెరవేర్చుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ రికీ పాంటింగ్‌ను కోచ్ బాధ్యతల నుంచి, అలాగే టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ పదవి నుంచి సౌరవ్ గంగూలీని తప్పించిన విషయం తెలిసిందే. వాళ్ల స్థానంలో హేమాంగ్ బదాని, వేణుగోపాల్ రావు బాధ్యతలు కట్టబెట్టింది.
అయితే తాజాగా కెప్టెన్సీలోనూ మార్పు చేయాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పంత్ వ్యతిరేకించాడని, సారథి బాధ్యతలు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే జట్టు పగ్గాల విషయంలో యాజమాన్యం అంగీకరించకపోవడంతో పంత్ ఢిల్లీ ఫ్రాంచైజీని వీడనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మరోవైపు కెప్టెన్-వికెట్ కీపర్ కోసం ఎదురుచూస్తున్న ఆర్సీబీ.. పంత్‌ను తమ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. వేలంలోకి పంత్‌ను దక్కించుకోవాలని నిర్ణయించుకుందని సమాచారం.
ఇటీవల పంత్ వేలంలోకి వస్తున్నట్లు పరోక్షంగా ట్విటర్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేగాక ఆర్సీబీలోకి ఈ వికెట్ కీపర్ రావాలని ప్రయత్నించగా, విరాట్ కోహ్లి బెంగళూరు యాజమాన్యంతో సంప్రదించి అడ్డుకున్నాడని ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌పై.. పంత్ తీవ్రంగా మండిపడ్డాడు. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని రిప్లై కూడా ఇచ్చాడు. సోషల్ మీడియాగా పంత్ రియాక్షన్స్ ఢిల్లీ వీడనున్న వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.