Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడిని భారత మాజీ, ప్రస్తుత క్రికెటర్లు ఖండిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే మనమంతా ఐక్యంగా కలిసి ఉండాలని, బాధ్యులు కచ్చితంగా భారీ మూల్యం చెల్లించుకుంటారని అంటున్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీవాస్తవ్ గోస్వామి.. పాకిస్థాన్ పై నిప్పులు చెలరేగాడు. భవిష్యతుల్లో కూడా పాకిస్థాన్ తో క్రికెట్ ఆడకూడదని బీసీసీఐకి ఓ లేఖ కూడా రాశాడు.
చంపడమే వాళ్ల జాతీయ క్రీడ...
"ఇదే కారణం నేను ఎప్పుడూ చెప్పేది.. పాకిస్థాన్ తో క్రికెట్ ఆడొద్దు. ఇప్పుడే కాదు. ఎప్పటికీ వద్దు. బీసీసీఐ, భారత ప్రభుత్వం - పాకిస్థాన్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును పంపనందుకు, కొంతమంది ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. రాజకీయాల కన్నా క్రీడలే ఎక్కువ అంటూ మాట్లాడారు?. అమాయక భారతీయులను హత్య చేయడం వాళ్ల జాతీయ క్రీడలా అనిపిస్తోంది. వాళ్లు అలా ఆడితే.. మనం కూడా వాళ్లు అర్థం చేసుకునే భాషలోనే ఆడాలి. బ్యాట్‌లు, బంతులతో కాదు.. సంకల్పంతో, గౌరవంతో, సహనం లేకుండా ఆడాలి. నాకు చాలా కోపంగా ఉంది. నా హృదయం విరిగిపోయింది. కేవలం కొన్ని నెలల క్రితమే లెజెండ్స్ లీగ్ కోసం నేను కశ్మీర్‌కి వెళ్లాను. పహల్గాం వీధుల్లో నడిచాను. అక్కడి ప్రజలతో మాట్లాడాను. వాళ్ల కళ్లలో మళ్లీ చిగురించిన ఆశను చూశాను. అది చూసినప్పుడు ఎట్టకేలకు అక్కడికి శాంతి తిరిగొచ్చిందనిపించింది. కానీ ఇప్పుడు... మళ్లీ ఈ రక్తపాతం. ఇది మనలో ఏదో తెలియని భావనను పెంచుతోంది. మనవాళ్లు చనిపోతున్నప్పుడు.. ఎన్ని సార్లు మౌనంగా ఉండమంటారా? క్రీడా భావనతోనే ఉండమంటారా? ఈ సారి అలా జరగదు." అని శ్రీవాస్తవ్ పేర్కొన్నాడు.
పొట్టన బెట్టుకున్నారు...
కాగా, కశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరు గాంచిన పహల్గాం సమీప బైసరన్ లోని కొండల మధ్యలో ఉగ్రవాదులు భీకర దాడికి పాల్పడ్డారు. ఏప్రిల్ 22న మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన కొంతమంది ముష్కరులు పర్యటకులను చుట్టుముట్టి.. అతి దగ్గరు వచ్చి దారుణంగా కాల్పులు జరిపారు. ముఖ్యంగా పురుషులను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది వరకు ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు.
