ఐపీఎల్ మోస్ట్ పాపులర్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ మైక్ హెసాన్ కాంట్రాక్ట్ ముగిసింది. దీంతో వచ్చే ఏడాది నుంచి ఈ టీంలో హెసాన్ ఉండడు. ఇలా కాంట్రాక్ట్ ముగిసిన సందర్భంగా సోషల్ మీడియాలో హెసాన్ ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
హెసాన్ నేతృత్వంలో గత నాలుగు ఐపీఎల్ సీజన్లలో ఆర్సీబీ మూడు సార్లు ప్లేఆఫ్స్ చేరిన సంగతి తెలిసిందే. కానీ తమ తొలి ట్రోఫీ అందుకోలేక పోయినందుకు హెసాన్ చాలా బాధ వ్యక్తం చేశాడు. 'చివరి నాలుగు సీజన్లలో మూడు సార్లు ప్లేఆఫ్స్ చేరుకొని రాణించాం. కానీ ఆ ట్రోపీ మాత్రం అందుకోలేకపోయాం' అని తన ఇన్‌స్టా పోస్టులో బాధపడ్డాడు.

'ఈ ట్రోఫీ నెగ్గాలని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, అద్భుతమైన మద్దతు ఇచ్చిన ఫ్యాన్స్ అంతా కోరుకున్నారు. ఇప్పుడు ఇలా ఆర్సీబీకి దూరం అవడం చాలా బాధ కలిగిస్తోంది. కానీ ఈ ఫ్రాంచైజీతో నాకు ఎన్నో మంచి అనుభవాలు ఉన్నాయి. మైదానం లోపలా, బయటా కొందరు అద్భుతమైన వ్యక్తులను కలిశా' అని చెప్పుకొచ్చాడు.
'నాకు ఇంత మద్దతు ఇచ్చిన ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు. ఈ టీం కొత్త కోచింగ్ టీంకు ఆల్ ది బెస్ట్. ఇక ఆర్సీబీ అమేజింగ్ ఫ్యాన్స్‌కు.. మీరు చూపించిన మద్దతు ఎప్పటికీ మర్చిపోలేను. టీం కోసం మీరు చూపిన ప్యాషన్ ఎంతో గొప్పది. మీ మద్దతుతో నాకు ఇంట్లో ఉన్నాననే భావన కలిగించారు. అందుకని మీ ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్' అని హెసాన్ పేర్కొన్నాడు.
హెసాన్ కాంట్రాక్టు ముగిసిన సందర్భంగా.. తమ టీం హెడ్ కోచ్‌గా జింబాబ్వే లెజెండ్ ఆండీ ఫ్లవర్‌ను ఆర్సీబీ ఎంపిక చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 'ఐసీసీ హాల్ ఆఫ్ ఫేంలో ఉన్న స్టార్, టీ20 వరల్డ్ కప్ గెలిచిన కోచ్ ఆండీ ఫ్లవర్‌ను ఆర్సీబీ పురుషుల టీం హెడ్ కోచ్‌గా ఆహ్వానిస్తున్నందుకు చాలా థ్రిల్ ఫీల్ అవుతున్నాం' అని పోస్ట్ చేసింది.