
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ కోసం యూఏఈకి వెళ్లిన అన్ని జట్లు ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాయి. ఇక ఐపీఎల్ 13వ సీజన్‌కు ఇంకా వారం రోజులే ఉండడంతో జట్లన్నీ ప్రాక్టీస్ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ కఠోర సాధన చేస్తున్నాడు. కోహ్లీ ఆట విషయంలో ఎంతో నిబద్ధతతో ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
విరాట్ కోహ్లీ ఒకవైపు సాధన చేస్తూనే.. మరోవైపు బ్యాట్‌ను సిద్ధం చేసుకుంటున్నాడు. బ్యాట్ హ్యాండిల్ బ్యాలెన్స్ కావడానికి కొద్దిగా కట్ చేశానని శుక్రవారం తాను పోస్ట్ చేసిన ఓ వీడియోలో తెలిపాడు. 'బ్యాట్ సమతుల్యతకు నాకు రెండు సెంటీమీటర్లు కూడా చాలా ముఖ్యమైనది. నా బ్యాట్‌లను జాగ్రత్తగా చూసుకోవడం నాకు చాలా ఇష్టం' అని కోహ్లీ ట్విట్టర్‌లో తన పోస్ట్‌కు క్యాప్షన్ పెట్టాడు. ఆర్‌సీబీ కెప్టెన్ తన బ్యాట్ హ్యాండిల్‌ను రంపంతో కోస్తూ మరమ్మతులు చేస్తున్నాడు.
విరాట్ కోహ్లీ బ్యాట్ రిపేరింగ్ నైపుణ్యం తనను విపరీతంగా ఆకట్టుకుందని ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు హార్దిక్ పాండ్యా తెలిపాడు. తాను కూడా బ్యాట్‌లను రిపేర్ చేసే అవకాశం ఉంటే.. కచ్చితంగా కోహ్లీలా రిపేర్ చేస్తానని పేర్కొన్నాడు. యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2020 ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 19న అబుదాబి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య లీగ్ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో రాయల్ చాలెంజర్స్ తలపడనుంది.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచీ ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లున్నా ఆ జట్టు ఛాంపియన్‌గా అవతరించలేదు. ప్రతీసారి కప్పు మనదే అంటూ రావడం, ఒట్టి చేతులతో వెనుతిరగడం పరిపాటిగా మారింది. మూడుసార్లు ఫైనల్‌కు చేరినా కప్పు సాధించలేకపోయింది. 2016లో మినహా ఏ ఏడాది కూడా కనీస ప్రదర్శన కూడా కనబర్చలేదు. అదే ఇప్పుడు విరాట్ కోహ్లీ సేనకి పెద్ద లోటు.