ఉప్పల్ వేదికగా జరుగుతున్నతొలి టెస్టులో టీమిండియాపై ఇంగ్లాండ్ పైచేయి సాధిస్తుంది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. వరుసగా పెవిలియన్‌కు చేరుతున్నారు. మొదటి ఇన్నింగ్స్‌లో నిర్భయంగా షాట్లు ఆడిన మన ప్లేయర్లు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం అతిజాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఫలితంగా వికెట్లును చేజార్చుకుంటున్నారు.
ఓవర్‌నైట్ స్కోరు 316/6తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 420 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (196; 278 బంతుల్లో) త్రుటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. అయితే అతడి పోరాటంతో భారత్‌కు ఇంగ్లాండ్ 231 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. బుమ్రా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు.

లంచ్ బ్రేక్ విరామం అనంతరం ఛేదన ప్రారంభించిన భారత్ ఆచితూచి బ్యాటింగ్ చేసింది. యశస్వీ జైశ్వాల్ (15;35 బంతుల్లో), రోహిత్ శర్మ (39; 58 బంతుల్లో) తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. అయితే టామ్ హర్ట్లీ టీమిండియాను కష్టాల్లోకి నెట్టాడు. ఒకే ఓవర్‌లో జైశ్వాల్‌తో పాటు గిల్ (0)ను ఔట్ చేశాడు. కాసేపటికీ రోహిత్‌ను కూడా పెవిలియన్‌కు చేర్చాడు. కానీ కేఎల్ రాహుల్ (22; 48 బంతుల్లో), అక్షర్ పటేల్ (17; 42 బంతుల్లో) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి టీ విరామానికి 95/3తో జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు.
కానీ ఆఖరి సెషన్‌లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. 24 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయి 119/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే జడేజా(2; 20 బంతుల్లో) అనవసరపు పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. రూట్ వేసిన ఫుల్ టాస్‌ను ఫీల్డర్ వైపునకే బాది పరుగుకు ప్రయత్నించాడు. బెన్ స్టోక్స్ బంతిని అందుకొని మెరుపు వేగంతో రనౌట్ చేశాడు.
అయితే ఈ క్రమంలో వేగంగా పరిగెత్తిన జడేజాకు తొడకండరాలు పట్టేశాయి. అనంతరం మైదానాన్ని ఇబ్బంది పడుతూ వీడాడు. జడేజా తొడకండరాల గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ప్రారంభంకానున్న వైజాగ్ టెస్టుకు అతడు అందుబాటులో ఉండే అవకాశం అనుమానంగా కనిపిస్తోంది. జడేజా గాయం తీవ్రత గురించి టీమిండియా మేనేజ్మెంట్ స్పందించాల్సి ఉంది.