
గుజరాత్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 అర్ధంతరంగా రద్దు కావడంతో టీమిండియా ఆటగాళ్లు ఇటీవల ఇళ్లకు చేరుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. జూన్ 18-22 మధ్య ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఆడనున్నారు. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నారు. ఈ పర్యటనలో రాణించేందుకు భారత ఆటగాళ్లు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. దేహదారుఢ్యం సరిగ్గా ఉంచుకొనేందుకు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్‌లలో కసరత్తులు చేస్తున్నారు.
ఇంగ్లండ్ పర్యటన కోసం బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌ల్లో రాణించి టీమిండియాకు విజయాలనందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న జడ్డూ.. బుధవారం నుంచి సన్నద్ధత మొదలెట్టినట్టు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. గుజరాత్ జామ్‌నగర్‌లోని తన నివాసంలో ఉన్న జిమ్‌లోని పరికరాలను మొబైల్‌తో వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. రెండు ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
రవీంద్ర జడేజా గత శుక్రవారం ఓ వీడియోలో మాట్లాడుతూ ప్రజలను సురక్షితంగా ఉండమని చెబుతూనే తోటి వారికి సహాయం చేయాలని కోరాడు. 'దేశ ప్రజలందరూ దయచేసి ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉండండి. దాంతో మీరూ, మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఇలాంటి విపత్కర సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండి కరోనాతో పోరాడాలి. కాబట్టి దయచేసి మాస్కులు ధరిస్తూ తరచూ చేతులు శానిటైజ్ చేసుకోండి. ఏదైనా అవసరమైతే మీ చుట్టు పక్కలున్న వారికి కూడా సహాయం చేయండి' అని జడేజా కోరాడు.
వాంఖడే మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో రవీంద్ర జడేజా విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్, రెండు పరుగులు సాధించి మొత్తం (ఒక నోబాల్) 37 పరుగులు పిండుకున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డును జడేజా అందుకున్నాడు. 2011లో క్రిస్ గేల్ నమోదు చేసిన రికార్డును జడ్డూ సమం చేశాడు. గేల్ ధాటికి పరమేశ్వరన్ 37 పరుగులు సమర్పించుకున్నాడు.