
ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బెంగళూరు పేసర్ హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో 'సర్' జడేజా 5 సిక్సర్లు, ఒక ఫోర్, రెండు పరుగులు సాధించి మొత్తం (ఒక నోబాల్) 37 పరుగులు పిండుకున్నాడు. జడేజా కేవలం 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అంతేకాదు బౌలింగ్ చేసి మూడు వికెట్లు (3/13) కూడా పడగొట్టాడు. ఫీల్డింగ్‌లోనూ కీలకమైన క్రిస్టియాన్‌ని డైరెక్ట్ త్రో విసిరి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు.
నిజానికి రవీంద్ర జడేజా డకౌట్‌గా వెనుదిరగాలి. మైదానంలోకి రాగానే స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన జడేజా.. బౌండరీ లైన్ వద్ద క్రిస్టియాన్ చేతికి చిక్కాడు. కానీ అతను క్యాచ్‌ని నేలపాలు చేశాడు. క్యాచ్ పట్టినా.. చేతుల్లోంచి జారిపోయింది. బంతి కిందపడిపోతుండగా మరోసారి ప్రయత్నించినా.. లాభం లేకుండా పోయింది. అలా లైఫ్ లభించిన తర్వాత రెచ్చిపోయిన జడేజా.. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్‌లో వరుసగా 6,6,N6,6,2,6,4 బాదేశాడు. జడేజా దెబ్బకి చెన్నై 154/4 నుంచి 191/4తో ఇన్నింగ్స్‌ని ముగించింది.
హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు కొట్టడానికి ఎంఎస్ ధోనీ ఇచ్చిన సలహానే కారణం అని రవీంద్ర జడేజానే స్వయంగా వెల్లడించాడు. 'చివరి ఓవర్‌లో హిట్టింగ్ చేయాలని నేను ముందే నిర్ణయించుకున్నా. అయితే ఆ ఓవర్‌కి ముందు మహీ భాయ్ ఓ చిన్న సలహా ఇచ్చాడు. హర్షల్ పటేల్ బంతుల్ని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వేయబోతున్నట్లు అంచనా వేసి నన్ను అలెర్ట్ చేశాడు. దాంతో నేను ముందుగానే ఆ బాల్స్‌ని ఆడేందుకు సిద్ధమైపోయా. లక్కీగా నేను అన్ని బంతుల్నీ భారీ షాట్లు ఆడగలిగా. దాంతో చెన్నై 191 పరుగుల మార్క్‌ని చేరుకోగలిగింది. జట్టు పరంగా అవి మాకు చాలా కీలకమైన పరుగులు' అని జడేజా వెల్లడించాడు.
ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు నమోదు చేసిన రికార్డును రవీంద్ర జడేజా అందుకున్నాడు. 2011లో క్రిస్ గేల్ నమోదు చేసిన రికార్డును జడేజా సమం చేశాడు. క్రిస్ గేల్ ధాటికి పరమేశ్వరన్ 37 పరుగులు సమర్పించుకున్నాడు. అతని బౌలింగ్‌లో గేల్ 4 సిక్స్‌లు, 3 ఫోర్లతో 36 రన్స్ పిండుకున్నాడు. ఇందులో కూడా ఒక నోబాల్ ఉంది. ఇక సురేష్ రైనా ఒకే ఓవర్‌లో 32 పరుగులు పిండుకున్నాడు. అవానా బౌలింగ్లో 2 సిక్స్‌లు, 5 ఫోర్లతో రైనా ఈ ఘనతను అందుకున్నాడు.