భారత క్రికెట్‌లో అత్యంత నమ్మదగ్గ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రవీంద్ర జడేజా గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న జడ్డూ.. త్వరలోనే అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికే అవకాశం ఉందనే వార్తలు క్రీడా వర్గాల్లో వేడెక్కించాయి. 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా.. ఇప్పుడు వన్డేల్లోనూ తన ప్రభావాన్ని కోల్పోతున్నాడు. ముఖ్యంగా గత రెండేళ్లుగా గణాంకాలు చూస్తుంటే ఆయన కెరీర్ ముగింపు దశకు చేరుకుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గణాంకాలు ఏం చెబుతున్నాయంటే?
2023 వరల్డ్ కప్ ఏడాదిలో 26 మ్యాచ్‌లాడి 31 వికెట్లు తీసిన రవీంద్ర జడేజా.. ఆ తర్వాత పూర్తిగా వెనుకబడ్డాడు. 2025, 2026 సీజన్లలో కలిపి జడేజా కేవలం 13 వన్డేలు మాత్రమే ఆడాడు. వీటిలో జడ్డూ చేసింది కేవలం 139 పరుగులు మాత్రమే, తీసిన వికెట్లు 12 మాత్రమే. 208 వన్డేల అనుభవం ఉన్న ఆటగాడికి ఇవి చాలా పేలవమైన గణాంకాలు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ జడేజా మునపటి పదును చూపలేకపోతున్నాడు.

అక్షర్ పటేల్ రూపంలో ముప్పు!
జడేజా స్థానానికి అక్షర్ పటేల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. 2025లో అక్షర్ 11 వన్డేల్లోనే 290 పరుగులు చేయడమే కాకుండా 11 వికెట్లు తీసి తన సత్తా చాటాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ జట్టులో ఉన్న కారణంగా అక్షర్ అందుబాటులో లేకపోయినా, జూన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ నాటికి అతను జట్టులోకి రావడం ఖాయం. అప్పుడు జడేజా తన స్థానాన్ని కాపాడుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతుంది.
బ్యాటింగ్ స్థానంపై గందరగోళం
జడేజాను 5వ లేదా 6వ నంబర్‌లో ఆడించాలనే ప్రయోగం టీమిండియాకు ఏమాత్రం కలిసిరావడం లేదు. 5వ నంబర్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 30 పరుగులే చేసిన జడ్డూ, 7వ నంబర్‌లో మాత్రం 100 మ్యాచ్‌ల్లో 2056 పరుగులు చేశాడు. కానీ ప్రస్తుతం జట్టులో యువ ఆటగాళ్ల రాకతో జడేజా తన సహజసిద్ధమైన 7వ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోతున్నాడు. రాజ్‌కోట్ వన్డేలో అనవసరమైన షాట్ ఆడి కేవలం 4 పరుగులకే ఔట్ అవ్వడం ఆయనపై విమర్శలను పెంచింది.
సుందర్ గాయం.. జడేజాకు ఆఖరి అవకాశం?
వాషింగ్టన్ సుందర్ గాయపడి న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం కావడం జడేజాకు ఒక రకంగా వరంలా మారింది. ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ ఆయనే. మిగిలిన మ్యాచ్‌ల్లో బ్యాట్, బంతితో అసాధారణ ప్రదర్శన చేస్తే తప్ప, 2027 వన్డే వరల్డ్ కప్ రేసులో జడేజా నిలవడం కష్టమే. వయసు పైబడటం, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి వంటి యువ ఆటగాళ్ల పోటాపోటీ ప్రదర్శనలతో జడేజా వన్డే కెరీర్ ముగింపునకు చేరుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బహుశా స్వదేశంలో జరిగే తదుపరి సిరీస్ తర్వాత జడేజా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.