హైదరాబాద్: దాదాపు నెల రోజుల తర్వాత తన పర్యటనలు ముగించుకుని బుధవారం టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ముంబైకి చేరుకున్న సంగతి తెలిసిందే. తొలిసారి తన కుమార్తెని కళ్లారా చూసుకుని ఆనందంలో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.
అనంతరం బుధవారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో తన భార్య రీవా సోలంకీతో కలిసి జడేజా పాల్గొన్నాడు. క్యాస్ట్రాల్ సంస్ధ రవీంద్ర జడేజాని బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తన కుమార్తె నిధ్యానతో కలిసి హాజరయ్యాడు.
ఈ సందర్భంగా జడేజా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో చోటు చేసుకున్న ఆసక్తికర సంభాషణను మీడియాతో పంచుకున్నాడు. ధోనికి బైక్‌లంటే చాలా ఇష్టం. క్రికెట్ మ్యాచ్‌లు లేని సమయాల్లో వీధుల్లో బైక్‌పై ధోని చక్కర్లు కొడుతుండటం గతంలో చాలా సార్లు చూశాం.

తాజాగా ఓ బైక్ గురించి స్పిన్నర్ జడేజా, ధోనీ మధ్య చర్చుకు వచ్చింది. సుజుకి కంపెనీకి చెందిన హయాబూసా బైక్‌ని ధోనీ సలహా మేరకు కొనుగోలు చేసిన జడేజా ఆ బైక్‌పై ఎక్కువగా రైడ్‌కి వెళ్లలేకపోతున్నాడట. దీంతో ఆ బైక్ రైడింగ్‌ని ఎలా ఎంజాయ్ చేయాలో ధోనిని అడగటంతో అతడ నేర్పించాడంట.
'హయాబూసా చాలా మంచి బైక్ అని ధోనీ నాతో చెప్పాడు. దానిని నడపాలంటే కొంత శారీరక శ్రమ తప్పదు. ఎందుకంటే.. డ్రైవ్ చేసేటప్పుడు ఎక్కువగా వంగాల్సి ఉంటుంది. ధోని దగ్గర ఇప్పటికే చాలా బైక్‌లున్నాయి. ఎంతలా అంటే.. ఇప్పటికీ వాటి నంబర్లు అతనికి సరిగా తెలియవు' అని జడేజా అన్నాడు.
'అయితే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత పూర్తి స్థాయిలో ధోనీ బైక్ రైడింగ్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. ధోనీతో బైక్ రైడింగ్ కంటే.. గుర్రం స్వారీ చేయాలని నా కోరిక' అని జడేజా వెల్లడించాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా జులై 26 నుంచి శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.
లంక పర్యటనలో ఆతిథ్య జట్టులో మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కూడిన సిరిస్ ఆడనుంది. లంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో జడేజా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.