ధోనీకి తలనొప్పిగా మారిన రవీంద్ర జడేజా: అతను స్టాండ్ అప్ కేప్టెన్: భజ్జీ ఫైర్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో వరుస పరాజయాలతో చెన్నై సూపర్ కింగ్స్ సతమతమౌతోంది. ఆడిన మూడు మ్యాచ్‌లల్లోనూ ఓటమి పాలైంది. హ్యాట్రిక్ పరాజయాలను చవి చూసింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్ రైడర్స్..రెండో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, అనంతరం పంజాబ్ కింగ్స్ చేతుల్లో దారుణంగా ఓడిపోయింది. ఈ పరిణామాలతో ఈ జట్టుపై విమర్శల జడివాన కురుస్తోంది. ఈ మెగా టోర్నమెంట్‌లో చివరికంటా నిల్చోలేకపోవచ్చనే ఆరోపణలను ఎదుర్కొంటోంది చెన్నై సూపర్ కింగ్స్.

ధోనీ తప్పుకోవడంతో..
విమర్శకులు కేప్టెన్ రవీంద్ర జడేజానూ వదలట్లేదు. అతని నిర్వాకం వల్లే ఈ దారుణ పరిస్థితి ఏర్పడిందంటూ బాహటంగా విమర్శిస్తోన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ వారసుడిగా చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ పగ్గాలను అందుకున్న రవీంద్ర జడేజా.. దాన్ని నిలబెట్టుకోవట్లేదంటూ మండిపడుతున్నారు. టోర్నమెంట్ ఆరంభానికి ముందు చెన్నై ఫ్రాంఛైజీ.. జడేజాను కేప్టెన్‌గా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేస్తోన్నారు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్నట్లు ధోనీ ప్రకటించడం.. తన వారసుడిగా రవీంద్ర జడేజాను ఎంపిక చేయాలని ఫ్రాంఛైజీకి సూచించడం.. దానికి మేనేజ్‌మెంట్ అంగీకరించింది.

అనుభవం లేకున్నా..
అంతకుముందు కెప్టెన్ వ్యవహరించిన అనుభవం రవీంద్ర జడేజాకు లేదని, అయినప్పటికీ- ధోనీ సూచనలతోనే ఫ్రాంఛైజీ అతనికి సారథ్య బాధ్యతలను అప్పగించిందని, దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యాడని నిప్పులు చెరుగుతున్నారు. నిజానికి- తన కెరీర్‌లో ఏ రోజు కూడా రవీంద్ర జడేజా జట్టును ముందుండి నడిపించిన దాఖలాలు లేవు. కనీసం వైస్ కేప్టెన్‌గా అయినా.. స్టాండ్ బైగా అయినా కేప్టెన్‌గా పని చేయలేదు.

లెగాసీని తీసుకెళ్లడంలో ఫెయిల్..
అలాంటిది రాత్రికి రాత్రి సెకెండ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుకు కేప్టెన్సీ బాధ్యతలను స్వీకరించడం అంటే మాటలు కాదు. అలాంటి టాస్క్‌ను సమర్థవంతంగా నిర్వహించట్లేదని విమర్శకులు చెబుతున్నారు. రవీంద్ర జడేజా తన వైఖరితో ధోనీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నాడని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ స్పష్టం చేశాడు. తన కేప్టెన్సీ బాధ్యతలను కూడా అతను ధోనీ భుజాలపై పెడుతున్నాడని వ్యాఖ్యానించాడు. జడేజా భారం కూడా ధోనీ మోస్తున్నాడని చెప్పాడు.

ఫీల్డింగ్ సహా..
ఫీల్డింగ్‌ను సెట్ చేసే విషయాన్ని అతను పూర్తిగా ధోనీ మీదే ఆధారపడుతున్నాడని పేర్కొన్నాడు. ఇప్పటికీ ధోనీనే చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్‌గా తాను భావిస్తున్నానని హర్భజన్ తేల్చి చెప్పాడు. ఫీల్డింగ్ సహా గ్రౌండ్‌లో అనేక విషయాలను జడేజా.. ధోనీ మీద డిపెండ్ అవుతున్నాడని, ఇది అతనికి కొత్త తలనొప్పిని తీసుకొచ్చినట్టయిందని చెప్పాడు. రవీంద్ర జడేజాకు ఆత్మవిశ్వాసం అధికం అనడంలో సందేహాలు అక్కర్లేదని, బ్యాటింగ్, బౌలింగ్ చేస్తోన్న సమయంలో అది రెట్టింపు అవుతుందని అన్నాడు. కేప్టెన్‌గా ఒత్తిడికి గురవుతున్నాడని వ్యాఖ్యానించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications