భార్య వైపా? సోదరి వైపా?: జడేజా ఇంట ముదిరిన విభేదాలు
టీమిండియా స్టార్ క్రికెటర్ రవీంద్ర జడేజా కుటుంబంలో రాజకీయ సెగలు మరోసారి రాజుకున్నాయి. గుజరాత్‌లో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు జడేజా సోదరి, భార్య మధ్య ఉన్న విభేదాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. రాజ్‌కోట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డ్ నెం-2 నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన జడేజా సోదరి నైనాబా జడేజా పరాజయం పాలయ్యాడు. ఆ పరాజయంతో రవీంద్ర జడేజా ఇంట్లో రాజకీయంగా భార్య రివాబా జడేజాదే ఆధిపత్యం అని మరోసారి నిరూపితమైంది.
ప్రస్తుతం జడేజా భార్య రివాబా జడేజా గుజరాత్ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు. జామ్‌నగర్ నార్త్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె.. ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే జడేజా సోదరి నైనాబా మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వదినకు పూర్తి వ్యతిరేక దిశలో పయనిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. రివాబా జడేజాకు వ్యతిరేకంగా నైనాబా కాంగ్రెస్ తరపున స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారం చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

జడేజా క్రికెట్ కెరీర్‌లో నైనాబా జడేజా పాత్ర ఎంతో కీలకమైనది. తల్లి మరణం తర్వాత జడేజాను ఓ తల్లిలా పెంచి పెద్ద చేయడమే కాకుండా క్రికెటర్‌గా ఎదగడానికి ఆమె ఎంతో కష్టపడ్డారు. ఈ విషయాన్ని రవీంద్ర జడేజా కూడా పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నాడు. కానీ రాజకీయాల విషయానికి వచ్చేసరికి జడేజా తన భార్య రివాబాకు మద్దతుగా నిలుస్తున్నాడు. ఇది సోదరి నైనాబాకు రుచించడం లేదు. ఇటీవల రివాబా మంత్రి హోదాలో రాజ్‌కోట్ సందర్శనకు వచ్చినప్పుడు కూడా నైనాబా ఆమెపై విమర్శలు గుప్పించడం వీరి మధ్య ఉన్న గ్యాప్‌ను స్పష్టం చేస్తోంది.
ఓ వైపు కుటుంబంలో ఈ రాజకీయ రచ్చ కొనసాగుతుండగా.. రవీంద్ర జడేజా ప్రస్తుతం ఐపీఎల్ 2026 సీజన్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్‌కు ముందు అనూహ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ అయిన జడేజా.. మైదానంలో తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 132 పరుగులు చేయడంతో పాటు 6 వికెట్లు పడగొట్టాడు. మైదానంలో ఆల్ రౌండ్ షో చూపిస్తున్నప్పటికీ, ఇంటి వద్ద సోదరి ఓటమి, కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ వైరం జడేజాను కొంత ఇబ్బందికి గురిచేసే అంశాలేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications