
స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్‌ను అధిగమించి ఆసియా కప్ టోర్నీ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2022లో దుబాయ్‌లో హాంకాంగ్‌తో జరిగిన గ్రూప్ A మ్యాచ్‌లో జడేజా ఈ ఘనత సాధించాడు. ఇర్ఫాన్ పఠాన్ ఆసియా కప్ టోర్నీలో 22వికెట్లు తీయగా.. జడేజా 23వికెట్లు తీసి అతన్ని దాటేశాడు. ఇకపోతే జడేజా 2010లో తన తొలి ఆసియా కప్ టోర్నీ ఆడాడు. ఆ ఎడిషన్లో నాలుగు వికెట్లు తీశాడు. 2012లో ఒక వికెట్, 2014 ఎడిషన్ టోర్నమెంట్‌లో 7వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత.. 2016ఎడిషన్ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్లో జరగ్గా అక్కడ కూడా 3వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత 2018లో 7 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియాకప్‌లో అతను ఇప్పటి వరకు ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక వన్డే ఫార్మాట్‌లో పఠాన్ అన్ని వికెట్లు తీయగా.. జడేజా వన్డే, టీ20 ఫార్మాట్లలో జరిగిన ఆసియా కప్ టోర్నీలో ఈ వికెట్లు తీయడం గమనార్హం.
ఇకపోతే ఆసియా కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసినవారిలో శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ 30 తొలిస్థానంలో ఉండగా.. అదే దేశానికి చెందిన లసిత్ మలింగ (29) రెండో స్థానంలో, అజంతా మెండిస్ (26) మూడో స్థానంలో ఉన్నారు. ఇక పాకిస్థాన్‌కు చెందిన సయీద్ అజ్మల్ (25) నాలుగో స్థానంలో ఉన్నాడు. 2010 నుంచి 2022 వరకు జరిగిన ఆరు ఆసియా కప్ టోర్నీల్లో జడేజా 23వికెట్లు పడగొట్టి అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక ఆసియా కప్ 2022లో టీమిండియా వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలుపొందింది. హాంకాంగ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 40పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా గ్రూప్ ఏ టాపర్‌గా సూపర్ 4కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ సూర్యకుమార్ (68)దంచుడుకు తోడు కోహ్లీ (59) క్లాస్ ఇన్నింగ్స్ వల్ల నిర్ణీత 20ఓవర్లలో 2 వికెట్లకు 192పరుగులు చేయగా హాంకాంగ్ ఛేదనలో 152పరుగులకే పరిమితమైంది.