టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. అలాంటి ప్లేయర్‌ను కీలకమైన డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆడించకపోవడంపై చాలా గొడవ జరుగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది మాజీలు టీమిండియా మేనేజ్‌మెంట్‌ను తిట్టిపోస్తున్నారు. అశ్విన్ స్థాయి బౌలర్‌ను ఎవరైనా అలా పక్కన పెట్టేస్తారా? అని నిలదీస్తున్నారు.
ఇలాంటి సమయంలో అశ్విన్ షాకింగ్ విషయం వెల్లడించాడు. గత డిసెంబరులోనే తన క్రికెట్ కెరీర్ ముగుస్తుందని అనుకున్నట్లు తెలిపాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ తర్వాత.. ఆసీస్ సిరీస్ తన కెరీర్‌లో చివరిదని భార్యకు కూడా చెప్పేశాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అశ్విన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇది విన్న ఫ్యాన్స్ షాకైపోయారు. అయితే అశ్విన్ అలా అనుకోవడానికి కారణం టీమిండియా మేనేజ్‌మెంట్ కాదు. అతని మోకాలి గాయమే.

అశ్విన్ చాలా కాలం నుంచి మోకాలి నొప్పితో బాధపడుతూనే ఉన్నాడు. దీని వల్ల అతని కెరీర్ కూడా చాలా దెబ్బతింది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఈ గాయం మళ్లీ తిరగబెట్టిందట. మోకాలు బాగా వాచిపోయిందని, దీంతో తనకు ఎంతో సక్సెస్ ఇచ్చిన బౌలింగ్ యాక్షన్‌ను వదిలేయాలని ఆలోచించినట్లు అశ్విన్ చెప్పాడు. 'బంగ్లాదేశ్ సిరీస్ నుంచి రిటర్న్ వచ్చాక నా భార్యతో మాట్లాడా. ఆస్ట్రేలియా సిరీస్ నాకు చివరిదయ్యే అవకాశం ఉందని చెప్పేశా' అన్నాడు.
'నాకు మోకాలి సమస్య ఉండేది. కాబట్టి నా బౌలింగ్ యాక్షన్ మార్చుకోవాలి అనుకుంటున్నట్లు నా భార్యకు చెప్పా. అప్పుడు నా బౌలింగ్ యాక్షన్‌లో చాలా మొమెంటం ఉండేది. దీంత నా మోకాలిపై చాలా ప్రభావం పడేది. బంతి డెలివరీకి ముందు ల్యాండింగ్ సమయంలో మోకాలు అదిరిపోయేది' అని అశ్విన్ వెల్లడించాడు. ఇక బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో ఆ మోకాలు బాగా నొప్పి చేసిందన్నాడు.
'అప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మూడు, నాలుగేళ్లపాటు నేను బాగా బౌలింగ్ చేశా. అలాంటి బౌలింగ్ యాక్షన్‌ను సడెన్‌గా మార్చుకోవడం అనేంత చెత్త నిర్ణయం మరొకటి ఉండదు. నా మోకాలిపై చాలా భారం పడుతోంది. అందుకే బౌలింగ్ యాక్షన్ మార్చేసి, 2013-14లో ఉన్న యాక్షన్‌కు వెళ్లిపోతున్నా అని చెప్పా. ఆ తర్వాత నొప్పికి ఇంజెక్షన్లు తీసుకొని, రోజుకు 3-4 గంటలే కొత్త బౌలింగ్ యాక్షన్ ప్రాక్టీస్ చేశా' అని గుర్తుచేసుకున్నాడు.
ఆ తర్వాత మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే ఆస్ట్రేలియాతో బరిలో దిగానని అన్నాడు. 'మొదటి టెస్టులో బౌలింగ్ చేసేప్పుడు మూడు, నాలుగు ఓవర్లు వేసే వరకు అసలు బౌలింగ్ వేస్తున్నాను అనే అనిపించలేదు. అయితే ఆ తర్వాత నాకు ఉన్న అవేర్‌నెస్ వల్ల అలవాటు పడగలిగా' అని చెప్పాడు. పెర్ఫామెన్స్ ప్రకారం చూసుకుంటే.. అశ్విన్ సత్తాలో పెద్దగా మార్పు రాలేదు. ఆసీస్‌తో నాలుగు టెస్టుల్లో అతను 17.28 సగటుతో 25 వికెట్లు తీసుకున్నాడు. అతనిప ప్రదర్శనకు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు కూడా దక్కింది.