
హైదరాబాద్: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితుల గురించి వివరించాడు. నిజానికి అశ్విన్ 2018 -2020 మధ్య తన రిటైర్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచించాడట. ఒకానొక టైమ్‌లో ఆటకు ఇక వీడ్కోలు చెప్పేలేయాలని నిర్ణయించుకున్నాడట. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ప్రారంభంకానున్న నేపథ్యలో తన జీవితంలో ఎదుర్కొన్న కఠిన పరిస్థితులను అశ్విన్ వివరించాడు. నిజానికి టీమిండియాలో మణికట్టు మాంత్రికుడిగా అశ్విన్ పేరు తెచ్చుకున్నాడు. ఒకనొక టైమ్‌లో టీమిండియలో స్పిన్ విభాగం అంటే అశ్వినే అనేంతలా తన హవాను సాగించాడు. తక్కువ టైమ్‌లోనే ప్రపంచంలోనే టాప్ బౌలర్లలో ఒక్కడిగా ఎదిగాడు. అయితే 2017 నుంచి అశ్విన్ కెరీర్‌లో కష్టాలు మొదలయ్యాయి. అశ్విన్ వరుసగా గాయాలపాలయ్యాడు. గాయాలకు తోడు అదే సమయంలో యువ స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ టీమిండియాలో దూసుకొచ్చారు. క్రమంగా వికెట్లు తీస్తూ తమ సత్తాను చాటారు. దీంతో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ చోటు కోల్పోయాడు.
వరుస గాయాల వల్ల ఒకానొక సమయంలో ఓవర్‌లోని ఆరు బంతులను కూడా సౌకర్యవంతంగా వేయలేకపోయానని అశ్విన్ చెప్పా డు. జట్టులో ఎవరికైన గాయం అయితే ఇతరుల నుంచి మద్దతు ఉంటుందని, కానీ తనకు గాయమైనప్పుడు తనను ఎవరూ పట్టించుకోలేదని అశ్విన్ వాపోయాడు. ఆ సమయంలో తాను చాలా కుంగిపోయానని చెప్పిన అశ్విన్.. ఆ సమయంలో జట్టులోని ఇతరుల మద్దతు పొందడానికి తాను అర్హుడిని కాదేమోనని భావించానని ఆవేదన వ్యక్తం చేశాడు. జట్టు కోసం తాను ఎన్నో మ్యాచ్‌లు ఆడానని, ఎన్నో మ్యాచ్‌లను గెలిపించానని చెప్పాడు. అయినా తనకే ఎందుకిలా జరగుతుందని బాధపడినట్టు తెలిపాడు. నిజానికి తాను ఎదుటి మనిషి సహాయం ఆశించే వ్యక్తిని కానని, కానీ ఆ సమయంలో ఎవరైనా తోడుంటే బాగుంటుందని అనిపించిందని చెప్పాడు. 2018లో ఇంగ్లండ్ పర్యటనతోపాటు ఆడిలైడ్ టెస్ట్ తర్వాత తాను చాలా కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపాడు. ఆ సమయంలో తన భార్య తనను ప్రోత్సహించినట్టు చెప్పాడు. ఆ సమయంలో ఇక రిటైర్మైంట్ ప్రకటిద్దామని నిర్ణయించుకుని తన భార్యకు, వాళ్ల నాన్నకు విషయాన్ని చెప్పినట్టు తెలిపాడు. తన తండ్రి తనకు ధైర్యం చెప్పినట్టు అశ్విన్ చెప్పాడు. నేను పరిమిత ఓవర్ల క్రికెట్‌లోకి మళ్లీ రీఎంట్రీ ఇస్తానని ప్రోత్సహించరాని, అంతేకాకుండా ఆయన చనిపోయే లోపు తాను వైట్ బాల్ క్రికెట్ మళ్లీ ఆడతానని నమ్మకం వ్యక్తం చేసినట్టు అశ్విన్ వివరించాడు. తనపై తన తండ్రికి అంత నమ్మకం అని తెలిపాడు. కాగా టెస్ట్ ఫార్మాట్‌లో అశ్విన్ అగ్రశ్రేణి ఆటగాడిగా కొనసాగుతున్నప్పటికీ 4 సంవత్సరాలపాటు వన్డే, టీ20లకు దూరమయ్యాడు. అయితే 2021 టీ20 వరల్డ్‌కప్ మళ్లీ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ వరల్డ్‌కప్‌తోపాటు ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ రాణించి టీంలో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పటివరకు 81 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ 424 వికెట్లు పడగొట్టాడు. భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో మూడో ప్లేసులో నిలిచాడు. 111 వన్డేల్లో 150 వికెట్లు, 51 టీ20ల్లో 61 వికెట్లు తీశాడు.