
చెన్నై: కెరీర్ ఆరంభంలో మాజీ క్రికెటర్ డబ్యూవీ రామన్ చేసిన సూచనలే తన బౌలింగ్ మెరుగుదలకు, కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశాయని టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. బంతిని వైవిధ్యంగా తిప్పడంలో అశ్విన్‌ది ప్రత్యేక శైలి. మ్యాచ్‌లు లేని సమయాల్లో కూడా గల్లీ క్రికెట్ ఆడుతూ.. బంతిని వివిధ రకాల్లో స్పిన్ చేయడానికి యత్నిస్తూ ఉంటాడు. 2015, 2016, 2017లలో వరుసగా మూడేళ్ల పాటు అశ్విన్ 50కు పైగా టెస్టు వికెట్లు సాధించాడు. కెరీర్ 54వ టెస్టులోనే 300 వికెట్లను మార్కును అందుకున్న ఘనత అశ్విన్ ఖాతాలో ఉంది.
ఇటీవల కాలంలో తనకు అవకాశాలు తగ్గినా.. వచ్చిన అవకాశాలతో మళ్లీ గాడిలో పడటానికి రవిచంద్రన్ అశ్విన్ ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకూ 71 టెస్టులు ఆడిన అశ్విన్.. 365 వికెట్లు తీసాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లను ఏడు సార్లు సాధిస్తే.. ఐదేసి వికెట్లను 27 సార్లు తీశాడు. ఈ గణాంకాలు చాలు అశ్విన్ గొప్ప బౌలర్ అనడానికి. అయితే తన బౌలింగ్‌లో రిథమ్‌ను దొరకబుచ్చుకుని ఇన్ని వికెట్లు తీయడానికి కారణం డబ్యూవీ రామన్ పాత్ర చాలా ఉందని అశ్విన్ చెప్పాడు
'కెరీర్ ఆరంభంలో రామన్ చేసిన సూచనలే నా బౌలింగ్ మెరుగుదలకు, కెరీర్ ఎదుగుదలకు ఎంతగానో దోహదం చేశాయి. ఈరోజు నేను ఇక్కడ ఉండటానికి డబ్యూవీ రామనే కారణం. రామన్.. నా కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఎక్కువగా శ్రమించారు. అత్యంత క్రమశిక్షణతో ఉండే రామన్.. బంతిని ఎంతటి కచ్చితమైన వేగంతో స్పిన్ చేయాలనే విషయాన్ని నాకు నూరిపోశాడు. అదే సమయంలో బంతిని ల్యాండ్ చేసే విధానంలో కూడా రామన్ పాత్ర ఉంది' అని అశ్విన్ పేర్కొన్నాడు.
'నా బౌలింగ్‌లో రిథమ్ ఉందంటే అందుకు కారణం కచ్చితంగా డబ్యూవీ రామనే. బౌలింగ్ చేసేటప్పుడు 10 శాతం వేగం మించకూడదనే నిబంధనను రామన్ సూచించాడు. ఒకవేళ వేగాన్ని మార్చాల్సి వస్తే..15 శాతానికి పైగా వేగం ఉండాలని పదే పదే చెబుతూ ఉండేవాడు. ఇదే నన్ను ఒక గొప్ప స్థానంలో నిలబెట్టింది. నేను ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పట్నుంచీ రామన్ గొప్ప మార్గదర్శకుడిలా ముందుకు తీసుకెళ్లేవాడు. ఇప్పటికీ ఆయన చేసిన సూచనలు తప్పకుండా పాటిస్తా' అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. రామన్ ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టుకు కోచ్‌గా [పనిచేస్తున్న విషయం తెలిసిందే.
'ప్రస్తుతం క్రికెట్ గురించి ఆలోచించడం సరైంది కాదు. వైరస్ ప్రభావం అనంతరం తిరిగి సీజన్ ప్రారంభమైతే లీగ్ కంటే అంతర్జాతీయ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. మునుపటిలా ప్రేక్షకులు స్వేచ్ఛగా ఆటను ఆస్వాదించేందుకు కాస్త సమయం పట్టొచ్చు. నావరకైతే టెస్టు క్రికెట్‌కే నా తొలి ప్రాధాన్యం' అని అశ్విన్ అన్నాడు.