
కెప్టెన్ రోహిత్ శర్మ తనపై కురిపించిన ప్రశంసలకు తనకు ఏం చెప్పాలో అర్థం కాలేదని టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ టీమిండియా దిగ్గజ పేసర్ కపిల్ దేవ్ వికెట్ల రికార్డును అధిగమించాడు. దీంతో అశ్విన్‌పై రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. టీమిండియా ఆల్‌టైమ్ గ్రేట్ బౌలర్లలో అశ్విన్ ఒకడని కొనియాడాడు. రోహిత్ శర్మ ప్రశంసలపై తాజాగా స్పందించిన అశ్విన్ ఎవరైనా తనపై ప్రశంసలు కురిపిస్తే వాటిని సరిగ్గా స్వీకరించలేనంటూ చెప్పుకొచ్చాడు. కెప్టెన్ మాటలకు ఎలా స్పందించాలో తనకు తెలియదని, కొన్ని సార్లు భావోద్వేగంతో మాటలు రావన్నాడు. ఈ రోజు ఉదయం వరకు కూడా రోహిత్‌కు ఏం చెప్పాలో తనకు తెలియలేదన్నాడు. అయితే ఉదయం అల్పహారం సమయంలో నువ్వు చాలా మంచి మనసు ఉన్నవాడివని చెప్పినట్లు అశ్విన్ పేర్కొన్నాడు.
ఇక దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టడంతో ఆయన తన ఇంటికి బోకే పంపించి అభినందించినట్లు అశ్విన్ తెలిపాడు. కాగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రవిచంద్రన్ అశ్విన్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 6 వికెట్లు తీశాడు. దీంతో టెస్టు క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న కపిల్ దేవ్ రికార్డును అశ్విన్ అధిగమించాడు. కపిల్ దేవ్ 434 వికెట్లు తీయగా.. 436 వికెట్లతో కపిల్‌దేవ్‌ను అశ్విన్ అధిగమించాడు. తద్వారా టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో తొలి స్థానంలో ఉన్నాడు.
శ్రీలంకతో రెండో టెస్టుకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పాంచల్, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, శుబ్ మన్ గిల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, రిషభ్ పంత్, కేఎస్ భరత్, సిరాజ్, షమీ, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్.