హైదరాబాద్: టీమిండియా టాప్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సోమవారం చేసిన ఓ ట్వీట్ తమిళనాడు వర్గాల్లో పెను చర్చనీయాంశమైంది. త్వరలో 234 ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయని, తమిళనాడులోని యువకులందరూ సిద్ధంగా ఉండాలని ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు.
234 అనేది తమిళనాడు శాసనసభలో నియోజకవర్గాల సంఖ్య కావడంతో త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరుతాయన్న అర్థంలో అశ్విన్ ట్వీట్ చేసినట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది కూడా పూర్తిగా ముగియలేదు.
ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది. అయితే ఇటీవలే జయలలిత మరణం, తాజాగా ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామా, అన్నా డీఎంకే చీఫ్ శశికళ ముఖ్యమంత్రి కాబోతున్న తరుణంలో అశ్విన్ ట్వీట్స్ పైవిధంగా ట్వీట్ చేయడంతో చాలా ప్రాధాన్యత ఏర్పడింది.
అంతేకాదు అన్నాడీఎంకేలో అసమ్మతి ఏర్పడి ప్రభుత్వం కూలిపోతుందని అశ్విన్ భావించడా? అంటూ నెటిజన్లు పలు రకాలుగా ట్వీట్లు చేశారు. ఈ క్రమంలో రెండు గంటల తర్వాత అశ్విన్ మరో ట్వీట్ చేశాడు. తాను రాజకీయాలనుద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని.. త్వరలో జరగబోయే ఓ ఉద్యోగ మేళా సమాచారాన్ని మాత్రమే ప్రస్తావించానని తెలిపాడు.
'యువకులారా కూల్‌గా ఉండండి. ఈ ట్వీట్‌కు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు, కేవలం ఉద్యోగ ప్రకటనకు సంబంధించినది' అంటూ జోక్ చేశాడు.