న్యూఢిల్లీ: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ భారత క్రికెట్‌కు వెన్నెముక లాంటిదని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు.రంజీ ట్రోఫీని విస్మరిస్తే భారత క్రికెట్ నడ్డి విరుగుతుందని ట్విటర్ వేదికగా హెచ్చరించాడు. 'భారత క్రికెట్‌కు రంజీ ట్రోఫీ వెన్నెముక. రంజీ ట్రోఫీని విస్మరించడం ప్రారంభించిన క్షణం నుంచి భారత క్రికెట్ వెన్ను లేకుండా తయారవుతుంది'అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. కరోనా మహమ్మారి తీవ్రత పెరగడంతో ఈనెల 13న ప్రారంభంకావాల్సిన రంజీ ట్రోఫీని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఇక రవిశాస్త్రి ట్వీట్ చేసిన గంటకే బీసీసీఐ కార్యదర్శి జైషా రంజీ ట్రోఫీ నిర్వహణపై ప్రకటన చేయడం గమనార్హం. రంజీ ట్రోఫీని ఈసారి రెండు దశల్లో నిర్వహించనున్నట్లు జై షా ప్రకటించాడు. 'ఈ సీజన్లో రంజీ ట్రోఫీని రెండు దశల్లో నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది. మొదటి దశలో లీగ్ మ్యాచ్‌ల్ని పూర్తిచేయనున్నాం. జూన్‌లో నాకౌట్ టోర్నీ జరుగుతుంది. రంజీ ట్రోఫీ అత్యంత ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీ.
ప్రతీ ఏడాది భారత క్రికెట్‌కు ఎంతోమంది ప్రతిభావంతుల్ని అందిస్తుంది. ఈ టోర్నీ ఉద్దేశాన్ని కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం'' అని జై షా తెలిపాడు. 38 జట్లు బరిలో దిగే రంజీ ట్రోఫీ ఫిబ్రవరి రెండో వారంలో మొదలయ్యే అవకాశముంది. నెల రోజుల్లో లీగ్ దశ పూర్తవుతుంది. మార్చి 27న ఐపీఎల్‌ను ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తుంది. ఐపీఎల్ అనంతరం మళ్లీ రెండో దశ రంజీ ట్రోఫీ నిర్వహించాలని బోర్డు ఆలోచిస్తుంది.
టీమిండియా హెడ్ కోచ్ పదవికాలం ముగిసినప్పటి నుంచి రవిశాస్త్రి బీసీసీఐకి వ్యతిరేకంగా తన గళాన్ని విప్పుతున్నాడు. రంజీట్రోఫీ నిర్వహణ విషయంలో చురకలంటించిన శాస్త్రి... విరాట్ కోహ్లీ కెప్టెన్సీ విషయంలో కూడా బోర్డు పెద్దలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
విరాట్ కోహ్లీ కచ్చితంగా మరో రెండేళ్లు టీమిండియా టెస్టు కెప్టెన్‌గా కొనసాగేవాడని బోర్డు పెద్దల ఒత్తిడి వల్లే తప్పుకున్నాడని తెలిపాడు. రానున్న రెండేళ్లలో టీమిండియాకు అన్ని హోం సిరీస్‌లే ఉన్నాయని, అవి కూడా టెస్ట్ ర్యాంకింగ్స్‌లో బాగా వెనుక ఉన్న జట్లతో అని చెప్పాడు. దీంతో టెస్ట్ క్రికెట్లో కోహ్లీ విజయాల సంఖ్య 50 నుంచి 60కి పెరిగేది అన్నాడు. కోహ్లీకి అలాంటి రికార్డులు దక్కడం ఇష్టం లేక, అతడు సాధించిన ఘనతలు చూసి జీర్ణించుకోలేక, కొందరు అతడిపై ఒత్తిడి తెచ్చి కెప్టెన్సీ నుంచి తనకు తానుగా తప్పుకునేలా చేశారని వ్యాఖ్యానించాడు.