బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికపై తొలిసారి స్పందించిన రవిశాస్త్రి

హైదరాబాద్: బీసీసీఐకి 39వ అధ్యక్షుడిగా ఎన్నికైన సౌరవ్ గంగూలీపై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. గంగూలీ ఎన్నికతో భారత క్రికెట్ సరైన మార్గంలో వెళుతుందని తెలిపాడు. 2016లో రవిశాస్త్రి హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నప్పుడు గంగూలీ, లక్ష్మణ్, సచిన్ నేతృత్వంలోని సీఏసీ కమిటీ అతడిని పక్కన బెట్టింది.
రవిశాస్త్రి కంటే హెడ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే సూట్ అవుతాడని అతడికే పట్టం కట్టింది. ఆ సమయంలో గంగూలీ వల్లే తనకు హెడ్ కోచ్ పదవి దక్కలేదని రవిశాస్త్రి బహిరంగంగానే విమర్శించాడు. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనిల్ కుంబ్లేల మధ్య విభేధాలు తలెత్తడంతో కుంబ్లే కోచ్ పదవికి రాజీనామా చేయడం... ఆ తర్వాత హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి ఎంపికవడం తెలిసిందే.

గంగూలీ ఎన్నికపై రవిశాస్త్రి
ఈ నేపథ్యంలో గంగూలీ-రవిశాస్త్రిల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు అలానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై రవిశాస్త్రి మాట్లాడుతూ "బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టిన గంగూలీకి హృదయపూర్వక శుభాకాంక్షలు. దాదా అధ్యక్ష ఎన్నికతో భారత క్రికెట్ సరైన మార్గంలో పయనిస్తుందని భావిస్తున్నా" అని తెలిపాడు.

గంగూలీ సహజంగానే లీడర్
"గంగూలీ సహజంగానే లీడర్. క్రికెట్ పాలనా వ్యవహారాల్లో దాదా నాలుగు, ఐదేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇది భారత క్రికెట్‌కు మంచి విజయం. బీసీసీఐ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. దాదా బాగా పనిచేసి బీసీసీఐకి పూర్వవైభవాన్ని తీసుకురావాలి" అని రవిశాస్త్రి తెలిపాడు.

బీసీసీఐకి రావాల్సిన బకాయిలను
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుండి బీసీసీఐకి రావాల్సిన బకాయిలను పొందాలనే గంగూలీ అభిప్రాయాన్ని ఈ సందర్భంగా రవిశాస్త్రి సమర్థించాడు. గంగూలీ అధ్యక్ష పదవి స్వీకరించిన తర్వాత మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో రాబోయే ఐదేళ్ల కాలానికి ఐసీసీ నుంచి బీసీసీఐ $372 మిలియన్లు రావాల్సి ఉందని చెప్పారు.

బీసీసీఐ పరిపాలన సమర్థుల చేతిలో
ప్రస్తుతం బీసీసీఐ పరిపాలన సమర్థుల చేతిలో ఉందని వారికి ఏమి చేయాలో బాగా తెలుసని రవిశాస్త్రి అన్నాడు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌పై కూడా రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. "జాతీయ క్రికెట్ అకాడమీ అనేది ఓ సన్నాహక స్కూల్. అక్కడ హెడ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్‌తో నిత్యం టచ్‌లో ఉన్నా" అని తెలిపాడు.

ఎన్‌సీఏలో ద్రవిడ్ ఉండటం
"ఎన్‌సీఏలో ద్రవిడ్ ఉండటం భారత క్రికెట్‌కు ఎంతో దోహదం చేస్తుంది. బీసీసీఐ అధ్యక్షుడిగా దాదా, ఎన్‌సీఏలో ద్రవిడ్ ఉండటం భారత క్రికెట్‌కు గొప్ప భవిష్యత్తు ఉందని అనుకుంటున్నాను. భారత క్రికెట్‌లో ఇంతకంటే గొప్ప భాగస్వామ్యం ఆశించగలమా?" అని రవిశాస్త్రి తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications