
హైదరాబాద్: విపరీతమైన క్రికెట్ ఆడుతున్న ప్రస్తుత రోజుల్లో టీమిండియా టీ20 క్రికెట్‌ను పట్టించుకునే పరిస్థితుల్లో లేదని హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌ను 3-0తో భారత్ క్లీన్ స్వీప్ చేసిన అనంతరం రవిశాస్త్రి పైవిధంగా చెప్పుకొచ్చాడు.
ఆదివారం వాంఖడె వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం సంజయ్ మంజ్రేకర్‌తో రవిశాస్త్రి మాట్లాడుతూ 'ఈ మధ్య చాలా క్రికెట్ ఆడుతున్నాం. మా వరకు టీ20 క్రికెట్‌ను అసలు పట్టించుకోం. గెలిచినా, ఓడినా అది పెద్ద విషయం కాదు. కాకపోతే వీటిలో యువకులకు అవకాశం ఇవ్వడం ద్వారా 2019 వరల్డ్‌కప్‌కు ఎవరు సిద్ధంగా ఉన్నారో తెలుస్తుంది' అని రవిశాస్త్రి అన్నాడు.
ప్రస్తుతం తమ దృష్టంతా జనవరి 5 నుంచి జరగబోయే దక్షిణాఫ్రికా పర్యటనపైనే ఉందని అన్నాడు. 'దక్షిణాఫ్రికా పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం. హోమ్ సీజన్ విజయ పరంపరను కొనసాగిస్తామన్న నమ్మకం ఉంది. ఎలాంటి కండిషన్స్ అయినా సరే అది అంత సులువు కాదు. హోమ్ సీజన్‌లో ధర్మశాల మ్యాచ్ మాకు మంచి పాఠం నేర్పించింది' అని శాస్త్రి అన్నాడు.
ప్రస్తుతం భారత జట్టుకు ప్రపంచంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలిచే సత్తా ఉన్నదని రవిశాస్త్రి చెప్పాడు. 'దక్షిణాఫ్రికా పర్యటన ఓ ఛాలెంజ్. క్రికెట్ కెరీర్‌లో ఈ ఛాలెంజ్‌ను స్వీకరించకపోతే ఫన్ ఉండదు. ఇదొక మంచి సిరిస్ అవుతుంది. ఈ సిరిస్‌తో భారత్ ప్రపంచంలోని ఏ జట్టుతోనైనా తలపడుతుంది' అని రవిశాస్త్రి అన్నాడు.
ప్రత్యర్ధి జట్టు ఎంత టార్గెట్ ఇచ్చినా... భారత్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండటంతో అది సులువు అవుతుందని శాస్త్రి తెలిపాడు. ఎవరైతే యువ ఆటగాళ్లు ఈ సిరిస్‌లో చోటు దక్కించుకున్నారో వారు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగ పరచుకున్నారని అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.