పెర్త్: బీసీసీఐ పైన టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత క్రికెటర్ల సమయాన్ని, శక్తిని వృధా చేస్తున్నారని ఆయన మంగళవారం ధ్వజమెత్తారు. భారత్ ప్రపంచకప్‌కు ముందు వరుస పర్యటనలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాతో జరిగిన ముక్కోణపు సిరీస్ తన దృష్టిలో వృధా అన్నాడు. బిజీ బిజీ షెడ్యూల్‌తో మన ఆటగాళ్లు మానసికంగా ఒత్తిడికి గురయ్యారని అభిప్రాయపడ్డాడు. మన ఆటగాళ్లకు రీచార్జ్ అవసరమన్నాడు. ప్రపంచకప్‌కు ముందు వారు ఫ్రెష్‌గా ఉండవలసి ఉందన్నారు.
ప్రపంచకప్‌లో భాగంగా భారత్ ఆడిన మూడు మ్యాచులలోను గెలిచింది. ఈ గెలుపు పైన రవిశాస్త్రి ఆశ్చర్యం వ్యక్తం చేయలేదు. భారత్ పాక్, దక్షిణాఫ్రికా, యూఏఈల పైన గెలిచింది.
దీనిపై స్పందిస్తూ.. ఈ గెలుపు పైన తాను ఏమీ ఆశ్చర్యపోలేదని, జట్టు అద్భుతమైన ఫాంలో ఉన్నప్పుడు ఎందుకు సర్ ప్రైజ్ అన్నాడు. తనకు జట్టు పైన, వారి శక్తి సామర్థ్యాల పైన పూర్తి నమ్మకం ఉందని చెప్పాడు. పాక్, దక్షిణాఫ్రికా పైన అద్భుత ప్రతిభ కనబర్చారని చెప్పాడు.

విరాట్ కోహ్లీ పైన ప్రశంసలు
ఆస్ట్రేలియా మట్టి పైన విరాట్ కోహ్లీ కంటే బాగా ప్రతిభ కనబరిచిన మరో భారత బ్యాట్సుమెన్‌ను తాను చూడలేదన్నాడు. సచిన్ టెండుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌ల వంటి వారు ప్రతిభ కనబర్చారని, వారు తమ అంచనాలకు అనుగుణంగా ఆడారని చెప్పారు.
కోహ్లీని స్వేచ్ఛగా ఆడనివ్వాలి
విరాట్ కోహ్లీని స్వేచ్ఛగా ఆడనివ్వాలని చెప్పాడు. నాలుగు టెస్టు మ్యాచులలో నాలుగు సెంచరీలు చేసిన ఒక్క భారత బ్యాట్సుమెన్‌ను చూపించాలని ప్రశ్నించాడు. కోహ్లీ అసాధారణ బ్యాట్సుమెన్ అన్నాడు. టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియాను బాగా ఢీకొట్టడంలో కోహ్లీ పోరాట పటిమ కనిపిస్తుందన్నాడు.
కోహ్లీ అంతర్జాతీయ రికార్డులు బద్దలు కొడతాడా అని ప్రశ్నిస్తే.. ఇలాంటి వాటితో అతని పైన ఒత్తిడి పెంచడం సరికాదన్నాడు. అతనిని స్వేచ్ఛగా ఆడనివ్వాలని చెప్పాడు. అతని సామర్థ్యం మేరకు ఆడనివ్వాలన్నాడు.
భారత ఫీల్డింగ్ పైన మాట్లాడుతూ.. ఫీల్డింగులో ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఇది ఒకటి అన్నాడు. తాను గతం గురించి మాట్లాడదల్చుకోలేదని, అలాగే భవిష్యత్తు గురించి చెప్పదల్చుకోలేదన్నాడు. అయితే, ఇప్పుడు ఉన్న జట్టు మాత్రం అద్భుతమైన ఫీల్డింగ్ చేస్తోందన్నాడు. ఇప్పుడున్న జట్లలో అద్భుతమైన ఫీల్డర్లు చాలామంది ఉన్నారని కితాబిచ్చాడు.

ధోనీ-కోహ్లీ విభేదాలపై...
ధోనీ - కోహ్లీల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారంపైన కూడా రవిశాస్త్రి స్పందించాడు. ఇలాంటి రూమర్స్ సరికాదన్నాడు. ధోనీ - కోహ్లీల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నాడు.
తన దృష్టిలో ఇలాంటి అనవసర విషయాల పైన దృష్టి సారించి వారు తమ తమ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పాడు. వారు అలాంటివి మాట్లాడుకోవచ్చునని, కాని అవి వృథానే అన్నాడు. వారిద్దరు బాగానే ఉన్నారన్నాడు.

ఎనిమిదేళ్లుగా జట్టును ధోనీ నడిపిస్తున్నాడు
జట్టును ఎవరు నడిపిస్తున్నారనే విషయమై విలేకరులు ప్రశ్నించినప్పుడు... మహేంద్ర సింగ్ ధోనీ జట్టును నడిపిస్తున్నాడని చెప్పాడు. గత ఎనిమిదేళ్లుగా అతను జట్టుకు సారథ్యం వహిస్తున్నాడని చెప్పాడు. జట్టు కోసం అతను ఎప్పుడు ముందుంటాడని చెప్పాడు.
లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో దూకుడుగా ఆడతాడని కితాబిచ్చాడు. అతను భారత జట్టును ఎన్నో మ్యాచులలో గెలిపించాడని చెప్పాడు. అలాగే డ్రెస్సింగ్ రూంలోను ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉంటాడని చెప్పాడు. అతను సీనియర్ల నుండి ఎంతో నేర్చుకున్నాడని, అతను నిజమైన నాయకుడు అని కితాబిచ్చాడు.