
ముంబై: మహమ్మారి కరోనా వైరస్ (కోవిడ్-19)ను తరిమికొట్టడానికి భారతీయులంతా ఏకమవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపును టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి, వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్వాగతించారు. ఈ ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పివేసి కొవ్వొత్తులు, టార్చ్, సెల్‌ఫోన్ లైట్లు, ప్రమిదలు వెలిగించాలని శుక్రవారం ఉదయం దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించిన సంగతి తెలిసిందే.
మోదీ పిలుపుపై రవిశాస్త్రి స్పందించాడు. 130 కోట్ల మంది భారతీయుల బలం మరోసారి చాటాలని పేర్కొన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లు చేసి కరోనా వైరస్‌పై పోరాటానికి కొత్త శక్తిని సృష్టిద్దామని ట్వీట్ చేశాడు. ప్రధాని ఇంతకుముందు 'జనతా కర్ఫ్యూ'ను విధించిన విషయం తెలిసిందే. జనతా కర్ఫ్యూ స్ఫూర్తిని మరోసారి ప్రదర్శించాలని శుక్రవారం ఉదయం మోదీ వీడియో సందేశంలో పిలుపునిచ్చారు.
హర్భజన్ సింగ్ కూడా ఓ ట్వీట్ పోస్ట్ చేసాడు. 'అందరూ ఇళ్లల్లో ఉండడంలో ప్రతీ ఒక్కరి పాత్ర ఉంది. మన ప్రధాని నరేంద్ర మోదీ పట్ల గర్వంగా ఉంది. అందరం ఇలాగే ఇళ్లల్లోనే ఉంటూ జాగ్రత్తగా ఉందాం. ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు.. 9 నిమిషాల పాటు లైట్లు ఆర్పేసి టార్చ్, కొవ్వొత్తులు, దీపాలు, సెల్‌ఫోన్ లైట్లతో వెలుగులు నింపుదాం. అది కూడా ఇంట్లో ఉండి మాత్రమే. దయచేసి వీధుల్లో ప్రదర్శన చేయకండి' అని హర్భజన్ కోరాడు.
మార్చి 22న ప్రధాని మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూకు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసందే. సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టే సమయంలో పలు ప్రాంతాల వాసులు బయట రోడ్లపై ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి పొరపాట్లు చేయకండని హర్భజన్ విజ్ఞప్తి చేశాడు.
'ఈ ఆదివారం కరోనా వైరస్ సంక్షోభం సృష్టించిన అంధకారాన్ని సామూహికంగా సవాల్ చేస్తూ మనమంతా వెలుగుకుగల శక్తిని ప్రజ్వలింపచేద్దాం. ఆ మేరకు ఈ ఏప్రిల్ 5న 130 కోట్లమంది భారతీయుల అమేయశక్తిని మనం మేల్కొలుపాలి. మనమంతా 130 కోట్ల మంది భారతీయుల అమేయ సంకల్పాన్ని సమున్నత స్థాయికి తీసుకెళ్లాలి. ఈ దిశగా ఏప్రిల్ 5న, ఆదివారం నాడు రాత్రి 9 గంటల నుంచీ మీ అందరి సమయంలో 9 నిమిషాలను నాకివ్వండి.
జాగ్రత్తగా వినండి.. ఏప్రిల్ 5వ తేదీ.. ఆదివారం.. రాత్రి 9 గంటలకు.. మీ ఇళ్లలో ప్రవేశద్వారాల వద్ద, బాల్కనీలలో వెలిగించిన కొవ్వొత్తులు లేదా దీపపు ప్రమిదలతో టార్చీలు లేదా మొబైల్ ఫ్లాష్ లైట్లను చేతబట్టి 9 నిమిషాలపాటు నిలబడండి. మనం ఒంటరులం కాదని, మనలో ఎవరూ ఒంటరిగా లేరని, 130 కోట్లమంది భారతీయులమైన మనమంతా ఓ సామూహిక లక్ష్యసాధనకు కట్టుబడి ఉన్నామని దృఢంగా సంకల్పం చెప్పుకుందాం' అని ప్రధాని కోరారు.