
ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్ సమరం మొదలు కానున్న సంగతి తెలిసిందే. ఇకపోతే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా తమ ఫీల్డింగ్‌ను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉందని భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి టీమిండియా ప్రదర్శన పట్ల చాలా ఫోకస్ ఏర్పడింది. ఇక ఫీల్డింగ్ విషయంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల స్థాయికి తగ్గట్టుగా భారత్ తమ స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రవిశాస్త్రి అన్నాడు. శాస్త్రి ప్రకారం.. అవుట్‌ఫీల్డ్‌లో పరుగులు ఆదా చేయడంలో ఫీల్డర్లు చురుకుగా ప్రవర్తించాలని సూచించారు. కాసిన్ని పరుగులు ఆదా చేసినా.. రోహిత్ శర్మ సారథ్యంలోని బ్యాటింగ్ లైనప్‌కు అవి ఎంతో ఉపయుక్తమవుతాయని శాస్త్రి అభిప్రాయపడ్డారు.
'టీమిండియా మొదటి నుంచి మెరుగు పర్చుకోవాల్సిన ఏకైక విషయం ఫీల్డింగ్. వారు పాకిస్తాన్‌తో తొలి టీ20 ప్రపంచకప్ మ్యాచ్ నుంచి ఫీల్డింగ్ పట్ల ఎనలేని శ్రద్ధతో ఉండాలి. మైదానంలో A గ్రేడ్ ఫీల్డింగ్ సామర్థ్యాన్ని కనబర్చాలి. ఫీల్డింగ్లో ఆదా చేసే 15-20 పరుగులు మ్యాచ్ జయాపజయాలను కంప్లీట్ చేంజ్ చేయగలవు. లేకపోతే మీరు బ్యాటింగ్‌కి దిగిన ప్రతిసారీ.. ఆ 15-20 పరుగులు అదనంగా పొందాల్సిన ప్రెషర్ నెలకొంటుంది.' అని శాస్త్రి పేర్కొన్నాడు.
'ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా వంటి జట్ల ప్లేయర్లు క్రేజీగా ఫీల్డింగ్ చేస్తారు. ఆసియా కప్‌లో ఫీల్డింగ్‌తో శ్రీలంక ఎలా అదరగొట్టిందో చూశారా. తమ ఫీల్డింగ్‌తో రైడింగ్‌లో పాకిస్థాన్‌పై వారు ఫైనల్ గేమ్‌ను సైతం గెలుచుకున్నారు. అందుకే ఫీల్డింగ్ అత్యంత కీలకం.' అని రవిశాస్త్రి అన్నాడు. భారత టాపార్డర్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా వంటి పవర్-హిట్టర్లు ఉండడం టీమిండియా బ్యాటింగ్ లైనప్‌కు గట్టి బలమని రవిశాస్త్రి అన్నాడు. 'నేను గత ఆరు-ఏడేళ్లుగా భారత జట్టుతో అనుసంధానమయ్యా. కోచ్‌గా మంచి అనుభవాన్ని గడించాను. ఇప్పుడు నేను టీంను బయటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నా ప్రకారం.. టీ20 క్రికెట్‌లో భారత జట్టు ఎన్నడూ లేని విధంగా పటిష్ఠ లైనప్‌తో ఇప్పుడు ఉంది అని నేను భావిస్తున్నాను. సూర్య కుమార్ యాదవ్ 4వ స్థానంలో, హార్దిక్ 5వ స్థానంలో, రిషబ్ పంత్ లేదా దినేష్ కార్తీక్ 6వ స్థానంలో జట్టులో ఉండడం గతంలో ఉన్న జట్టుకు.. ఇప్పుడున్న జట్టుకు భారీ తేడా చూపిస్తుంది.' అని శాస్త్రి పేర్కొన్నాడు.