
హైదరాబాద్: మూడు మ్యాచ్‌ల సిరిస్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించే జట్టుని మార్లిబోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) గురువారం ప్రకటించింది. ఈ మేరకు 12 మందితో కూడిన ఇంగ్లిష్ కౌంటీ క్లబ్ జట్టును అధికారికంగా వెల్లడించింది. ఈ జట్టుకు శ్రీలంక మాజీ క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర కెప్టెన్‌గా వ్యవహారించనున్నాడు.
ఇదే జట్టులో భారత సంతతికి చెందిన సీనియర్ ఇంగ్లాండ్ క్రికెటర్ రవి బొపారా కూడా ఎంపికయ్యాడు. పాక్ పర్యటనలో భాగంగా ఎంసీసీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) జట్లైన లాహోర్ క్వాలండర్స్-ముల్తాన్ సుల్తాన్స్‌తో ఎంసీసీ ఆడనుంది.
మూడో మ్యాచ్‌ని పాకిస్తాన్ దేశవాళీ టీ20 మ్యాచ్ విజేత నార్తరన్‌తో తలపడనుంది. పాక్‌లో క్రికెట్‌ను బతికించాలంటూ పాక్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని ఎంసీసీ గత నెలలో ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా 2020 ఫిబ్రవరిలో లాహోర్‌కు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాక్ పర్యటనకు పంపేందుకు అంగీకరించింది.
"పాకిస్తాన్ వంటి దేశాలలో క్రికెట్కు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. 2009 యొక్క విషాద సంఘటన నుండి అంతర్జాతీయ క్రికెట్‌ను పాకిస్థాన్ రప్పించడంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీబీసీ) అద్భుతమైన పని చేసింది" అని ఎంసీసీ అధ్యక్షుడు కుమార సంగక్కర అన్నారు.
2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి తర్వాత ప్రధాన జట్లు ఆ దేశంలో పర్యటించేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. శ్రీలంక జట్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియానికి వెళ్తోన్న సమయంలో ఆ జట్టు ప్రయాణిస్తోన్న బస్సుపై ఉగ్రవాదాలు కాల్పులు జరిపారు. అప్పటి ఉగ్రదాడిలో మొత్తం ఎనిమిది మరణించగా... లంక జట్టులోని పలువురు క్రికెటర్లకు గాయలయ్యాయి.
ఆ ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వరల్డ్ ఎలెవన్ జట్టు ఒకసారి వెళ్లగా, ఇటీవల శ్రీలంక.. పాక్‌లో టెస్టు సిరీస్ ఆడింది. ఆ దాడి తర్వాత పాక్‌లో ఇదే తొలి టెస్టు సిరీస్ కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ సైతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ ఆడిన బంగ్లాదేశ్.. పాక్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది.
కుమార్ సంగక్కర (కెప్టెన్), రవి బొపారా, మైఖేల్ బర్గెస్, ఆలివర్ హన్నన్-డాల్బీ, ఫ్రెడ్ క్లాసేన్, మైఖేల్ లీస్క్, అరాన్ లిల్లీ, ఇమ్రాన్ ఖయ్యూమ్, విల్ రోడ్స్, సఫ్యాన్ షరీఫ్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, రాస్ వైట్లీ.