ఇలాంటి రోజొకటి వస్తుందని..! ఇంగ్లండ్ వాయింపుడుపై రషీద్ ఖాన్ రియాక్షన్

సౌథాంప్టన్: ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్ ఎవరు అని ప్రశ్నించుకుంటే- ఛప్పున గుర్తుకొచ్చే పేరు రషీద్ ఖాన్. ప్రపంచకప్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్.. ఈ ఆప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్‌కు పీడకలను మిగిల్చింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ల ధాటికి 54 బంతుల్లో రెట్టింపు పరుగులు సమర్పించుకున్నాడతను. తొమ్మిది ఓవర్లలోనే 110 పరుగులను ధారాదాత్తం చేశాడు. ఫలితంగా- ఇంగ్లండ్ 397 పరుగుల లక్ష్యాన్ని ఆఫ్ఘనిస్తాన్‌కు నిర్దేశించింది. కొండంత లక్ష్యాన్ని అందుకోలేక చతికిలపడింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఇక తన తదుపరి మ్యాచ్‌లో టీమిండియాను ఎదుర్కోబోతోంది. భారత కాలమానం ప్రకారం.. సౌథాంప్టన్‌లోని రోజ్‌బౌల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ ఆరంభం కాబోతోంది.

ఎంత గొప్ప ఆటగాడికైనా.. తప్పదు
అదలా వుంచితే- ప్రపంచకప్ చరిత్రలో ఎవరూ కోరుకోని రికార్డును నమోదు చేసుకోవడం పట్ల రషీద్ ఖాన్ స్పందించారు. ప్రతి ఒక్క ఆటగాడికీ ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అన్నారు. అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడే తమను తాము మెరుగు పరచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలకు మంచి కంటే చెడు మాత్రమే వెంటనే చేరుతుందని, చాలారోజుల పాటు అలాంటి ప్రదర్శనను గానీ, సందర్భాలను గానీ గుర్తుంచుకుంటారని రషీద్ ఖాన్ అన్నారు. పది మంచి మ్యాచులు ఆడినప్పటికీ.. ఒక్క మ్యాచ్‌లో ప్రదర్శన పేలవంగా ఉంటే.. మిగిలిన వాటిని ప్రజలు వెంటనే మరిచిపోతారని చెప్పారు. ఎంత గొప్ప ఆటగాడికైనా కేరీర్ మొత్తంలో ఒక్కసారైనా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయని అన్నారు.

దాని గురించి పెద్దగా ఆలోచించట్లేదు..
ఇంగ్లండ్‌తో తన బౌలింగ్ ఆశించిన స్థాయిలో లేదనే విషయాన్ని రషీద్ ఖాన్ అంగీకరించాడు. బౌలింగ్ బాగోలేదని, మరింత మెరుగు పర్చుకోవాల్సి ఉందని అన్నారు. భారత్‌తో మ్యాచ్ సందర్భంగా మెరుగైన ప్రదర్శన చేస్తామని అన్నారు. ఇంగ్లండ్‌లో పెద్ద ఎత్తున పరుగులను ఇచ్చిన విషయంపై తాను పెద్దగా ఆలోచించట్లేదని, ముందడుగు ఎలా వేయాలనే అంశంపైనే ప్రస్తుతం దృష్టి కేంద్రీకరించానని రషీద్ ఖాన్ వ్యాఖ్యానించాడు. తన ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తోన్న విషయం తన దృష్టికి వచ్చిందని, తరువాతి మ్యాచ్‌లో బాగా ఆడి, వాటికి సమాధానం చెబుతానని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాను చేసిన తప్పులపై దృష్టి పెట్టానని, వాటిని సరి చేసుకున్నానని చెప్పారు.

కేప్టెన్సీ మార్పుపై..
ప్రపంచకప్ ముంగిట్లో ఆఫ్ఘనిస్తాన్ కేప్టెన్సీ మార్పు అంశం జట్టుపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేదని అన్నారు. అస్ఘర్ ఆఫ్ఘన్‌ను తొలగించి ఆయన స్థానంలో గుల్‌బదీన్‌ను కేప్టెన్‌గా నియమించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. దీనిపై రషీద్ ఖాన్, అతని తోటి స్పిన్నర్ మొహమ్మద్ నబీ అసంతృప్తిని వ్యక్తం చేశారంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. రషీద్ ఖాన్, గుల్‌బదీన్ మధ్య సత్సంబంధాలు లేవంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిపై రషీద్ ఖాన్ స్పందించారు. ఆ వార్తలను నిరాధారమైనవిగా కొట్టి పడేశారు. గుల్‌బదీన్‌తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications