
ఆసియా కప్‌కు ముందు విరాట్ కోహ్లీ, బాబర్ ఆజామ్ గురించి ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆగస్టు 28న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుండడంతో బాబర్ ఆజామ్, విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేక చర్చలు నడుస్తున్నాయి. ఇకపోతే ఎన్నోసార్లు వీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రషీద్ ఖాన్ బౌలింగ్ చేశాడు. రషీద్ బౌలింగ్లో వీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఆడే సంగతి తెలిసిందే. ఇకపోతే ఓ ప్రముఖ యూట్యూబర్ రషీద్ ఖాన్‌ను వీరిద్దరిలో ఎవరికి బౌలింగ్ చేయడం కష్టంగా ఉంటుందని అడగ్గా రషీద్ స్పందిస్తూ.. ' అమ్మో వాళ్ల గురించి అడుగుతున్నారు. ఇద్దరూ ఇద్దరే. వాళ్లిద్దరికి బౌలింగ్ చేయడం సమానమైన రీతిలో కఠినంగా ఉంటుంది.
వీరిద్దరు ఒకే తరహా బ్యాటర్లు. వారు మనం ఎంత మంచి డెలివరీ వేసినా తమ లయ కోల్పోరు. కాబట్టి నాకైతే వారిద్దరికీ బౌలింగ్ చేయడం కష్టంగా అనిపిస్తుంది. అయినప్పటికీ.. వాళ్లకు బౌలింగ్ చేయడం నాకు మంచి సవాల్‌గా అనిపిస్తుంది. ఆ సవాల్‌ను నేను పూర్తిగా ఆస్వాదిస్తాను. నేను వారిద్దరికీ లూజ్ బాల్స్ వేస్తే అంతే సంగతి. అందుకే చాలా జాగ్రత్తతో బౌలింగ్ వేస్తా. ఇక సాధారణంగా నేను సరైన పిచ్ ప్రాంతాల్లో బౌలింగ్ చేయడంపై ఎక్కువ దృష్టి సారిస్తాను. ఏదేమైనా వారిద్దరినీ ఎదుర్కోవడం చాలా కష్టమే' అని సవేరా పాషాతో యూట్యూబ్ ఇంటరాక్షన్‌లో రషీద్ చెప్పాడు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో వీరిద్దరు అగ్రస్థాయి బ్యాటర్లు కావడం వల్ల వాళ్లకు బౌలింగ్ చేయడం నాకు గొప్పగా అనిపిస్తుందని రషీద్ ఖాన్ చెప్పాడు. ఇకపోతే తాను 'SRHలో ఉన్నప్పుడు నెట్ ప్రాక్టీస్లో కేన్ విలియమ్సన్‌కి బౌలింగ్ చేసేవాడినని.. అప్పుడు నా బౌలింగ్ గురించి కేన్‌కు, తన బ్యాటింగ్ గురించి నాకో ఐడియా వచ్చింది. అయితే ఐపీఎల్లో నేను కోహ్లీని ఎప్పుడూ ప్రత్యర్థిగానే ఎదుర్కొన్నా. ఇక ఐపీఎల్‌లో చాలా సార్లు కూడా విరాట్‌తో చర్చించా, అలాగే బాబర్‌తో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడాను' అని రషీద్ చెప్పాడు.