
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్‌లో క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరు అభిమానుల మదిలో చిరకాలం గుర్తుండిపోతుంది. అందులో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ అసాధారణ ప్రదర్శన సీజన్‌లోనే హైలెట్‌గా నిలిచింది. 10 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లతో బ్యాటింగ్(34)లో.. బౌలింగ్(3/19)లో.. ఫీల్డింగ్(రెండు క్యాచ్‌లు, ఒక రనౌట్)లో అన్నీ తానే ఒంటిచేత్తో హైదరాబాద్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు.
అతడి పోరాటంతోనే హైదరాబాద్ 14 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో అతని ఆల్‌రౌండ్ షోకు ఫిదా అయిన అంతర్జాతీయ సమాజం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. కేవలం క్రికెట్ ఆట..క్రీడలకు సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాదు.. సినీ, రాజకీయ, పాత్రికేయ, తదితర రంగాల ప్రముఖులు ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు.
రషీద్ హీరో అని.. ఆతని ఆటతీరు పట్ల దేశం మొత్తం గర్వంగా ఫీలవుతున్నట్లు సాక్షాత్తు అఫ్ఘనిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ట్విటర్‌లో పేర్కొనడం విశేషం. మహేశ్ బాబు, సచిన్ లాంటి దిగ్గజాలు సైతం స్పందించి శుభాకాంక్షలు అందజేశారు.
ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదికగా నిలవనుంది. చెన్నై, హైదరాబాద్‌లు బలబలాలు నిరూపించుకుని కప్ గెలుచుకునేందుకు ఆరాటపడుతున్నాయి.