
హైదరాబాద్: క్రికెట్‌లో సాధారణంగా పేస్ బౌలర్లు విసిరిన బంతులకు వికెట్లు విరిగిపడుతుంటాయి. అయితే ఓ స్పిన్నర్ వేసిన బంతికి వికెట్లు విరిగిపడితే నిజంగా అది అద్భుతమే. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో అప్ఘానిస్థాన్ యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ విసిరిన గుగ్లీకి వికెట్ విరగడం విశేషం.
బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్ చిట్టగాంగ్ వికింగ్స్‌పై ఈ అరుదైన ఘనతను నమోదు చేశాడు. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తోన్న శ్రీలంక బ్యాట్స్‌మెన్ దిల్షాన్ మునవీరాను రషీద్ బౌల్డ్ చేశాడు. రషీద్ విసిరిన బంతి మిడ్ వికెట్‌ను విరగొట్టింది.
దీంతో మునవీరా 19 బంతుల్లో 25 పరుగులు చేసి నిరాశగా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ తీసిన ఏకైక వికెట్ ఇదే. నాలుగు ఓవర్లు వేసిన రషీద్ ఖాన్ ఒక వికెట్ తీసి 17 పరుగులిచ్చాడు. మిస్బా ఉల్ హక్ నేతృత్వంలోని చిట్టగాంగ్ వికింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 139 పరుగులు చేసింది.
ఓపెనర్లు ల్యూక్ రోంచి (31), సౌమ్య సర్కార్ (30) పరుగులతో రాణించారు. ఒకానొక దశలో భారీ స్కోరు దిశగా సాగినప్పటికీ కొమిల్లా విక్టోరియన్స్ స్పిన్ త్రయం రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, అరాఫత్ సన్నీలు తమ అద్భుతమైన బౌలింగ్‌తో చిట్టగాంగ్ తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
ఇక, రషీద్ ఖాన్ విషయానికి వస్తే ఐపీఎల్ 10వ సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేశాడు. అంతేకాదు ఆస్ట్రేలియాకు టీ20 లీగ్ బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన తొలి ఆప్ఘన్ ప్లేయర్‌గా రషీద్ ఖాన్ చరిత్ర సృష్టించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.