
కాబుల్: నేడు అఫ్గానిస్థాన్ దేశ స్వాతంత్ర దినోత్సవం. అఫ్గానిస్థాన్‌లో ఏటా ఆగస్టు 19న స్వాతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. ఈ సారి తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అఫ్గానిస్థాన్ దేశంలోని ప్రధాన నగరాల్లో కొందరు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాలతో ర్యాలీ చేపట్టారు. దీంతో తాలిబన్లు వారిపై కాల్పులు జరిపారు. తుపాకుల శబ్దంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. కాల్పులు, తొక్కిసలాట కారణంగా పలువురు మృతిచెందినట్లు సమాచారం.
అఫ్గానిస్థాన్‌లో ముష్కరుల విధ్వంసకాండ చూసి ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 'ఈరోజు అఫ్గానిస్థాన్ స్వాతంత్ర దినోత్సవం. దేశం కోసం మనమందరం కొంత సమయం కేటాయిద్దాం. ఆ త్యాగాలను ఎప్పటికీ మర్చిపోము. శాంతియుత, అభివృద్ధి కోసం ప్రార్థిస్తున్నాం. ఐక్యరాజ్యసమితి నుంచి సాయం ఆశిస్తున్నాము' అని రషీద్ ఖాన్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ప్రస్తతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసిన అందరూ చలిస్తున్నారు.
తాలిబన్లు మళ్లీ విద్రోహ చర్యలకు తెగబడుతుండటంతో అఫ్గాన్ ప్రజల్లో భయాందోళనలు మరింత తీవ్రమయ్యాయి. కాబుల్‌లో బుధవారం చాలామంది ఇళ్ల నుంచి అడుగు కూడా బయటపెట్టలేదు. మరికొందరు మాత్రం దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. కాబుల్ విమానాశ్రయానికి వందల మంది తరలివచ్చారు. అయితే విమానాశ్రయానికి వెళ్లే దారుల్లోనూ పలుచోట్ల ప్రజలను తాలిబన్లు చితకబాదారు. తాలిబన్ల ఆక్రమణ నేపథ్యంలో ఇటీవల కుప్పకూలిన ప్రభుత్వంలోని కీలక నేతలు అఫ్గాన్‌లోని పంజ్‌షేర్ లోయ ప్రావిన్సులో బుధవారం భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అఫ్గాన్ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్, రక్షణ మంత్రి జనరల్ బిస్మిల్లా మొహమ్మదీ, మరో కీలక నేత అహ్మద్ మసూద్ ఇక్కడ చర్చలు జరిపారు. తాలిబన్ల తీరును సవాలు చేసే దిశగా వారు సన్నాహాలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అఫ్గాన్‌లో పంజ్‌షేర్ లోయ ప్రావిన్సు మాత్రమే ప్రస్తుతం తాలిబన్ల అధీనంలో లేదు.
ప్రస్తుతం అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ క్రమంలోనే వారు ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు ఆడతారో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. అయితే ఈ సందిగ్ధతకు తెరదించుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ సోమవారం క్లారిటీ ఇచ్చింది. 'ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతున్నదానిపై మేము మాట్లాడలేం. కానీ రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ మాత్రం టోర్నీకి అందుబాటులో ఉంటారు' అని సన్‌రైజర్స్ టీమ్ సీఈవో షణ్ముగం స్పష్టం చేశారు. ఈ నెల 31న తమ టీమ్ యూఏఈకి బయలుదేరుతోందని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 19 నుంచి ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.