
హైదరాబాద్: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఛాలెంజ్‌లు ఎక్కువయ్యాయి. మొన్న కేంద్ర క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాధోడ్ ఫిట్‌నెస్ ఛాలెంజ్‌కు స్వీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ మరొక ఛాలెంజ్‌కి... ఇప్పుడు తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలువురు మాజీ, ప్రస్తుత క్రికెటర్లకు ఓ ఛాలెంజ్ విసిరాడు.
తనకంటే తక్కువ సమయంలో ఈ ఛాలెంజ్‌ను ఎవరైనా పూర్తి చేయగలరా? అని అడిగాడు. ఇంతకీ కోహ్లీ విసిరిన ఛాలెంజ్ ఏంటని అనుకుంటున్నారా? క్యాచ్‌లు పట్టడం. క్యాచ్‌లు పట్టడం ఏముందని అనుకుంటున్నారా? అయితే, ఈ క్యాచ్‌లను కాస్త వైరటీగా పట్టాలి. అవి ఎలా పట్టాలో కూడా విరాట్ కోహ్లీ తాను పోస్టు చేసిన వీడియోలో చేసి చూపించాడు.
"8 సెకన్లలో.. ఆరు క్యాచ్‌లు... ఒక్కటీ మిస్ అవ్వకుండా పట్టాను. మీరు నా కంటే తక్కువ సమయంలో పట్టగలరా?" అంటూ కోహ్లీ... కేఎల్ రాహుల్, జాంటీ రోడ్స్, రషీద్‌ఖాన్, డుప్లిసిస్, షకీబ్ ఆల్ హాసన్, గిబ్స్‌కు సవాల్ విసిరాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడుతోంది.
ఇప్పటివరకు ముగిసిన మూడు టెస్టుల్లో టీమిండియా 1-2తో వెనుకంజలో ఉంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు ఆగస్టు 30న సౌతాంప్టన్ వేదికగా ప్రారంభం కానుంది.