హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ గుర్తుండే ఉంటాడు. సన్ రైజర్స్ యాజమాన్యం రషీద్ ఖాన్‌ను వేలంలో రూ. 4 కోట్లకు కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
తాజాగా కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో అమెజాన్ వారియర్స్ తరపున ఆడుతున్న రషీద్ ఖాన్ హ్యాట్రిక్ తీశాడు. గూగ్లీ బంతులతో విండీస్ ప్లేయర్లను ఖంగుతినిపించాడు. డిఫెండింగ్ చాంపియన్ జమైకా తల్హాస్‌తో జరిగిన మ్యాచ్‌లో రషీద్ హ్యాట్రిక్ వికెట్లతో సంచలనం నమోదు చేశాడు.

తొలుత జమైకా జట్టు బ్యాటింగ్‌కు దిగిన క్రమంలో ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో రషీద్ విజృంభించాడు. 15 ఓవర్ మొదటి బంతికి మెక్ కార్తీ అవుట్ చేసిన రషీద్.. ఆపై వరుస రెండు బంతుల్లో జా ఫూ, రోవ్ మాన్ పావెల్ అవుటయ్యారు. ఈ మూడు వికెట్లను బౌల్డ్ రూపంలో రషీద్ ఖాతాలో చేరడం విశేషం.
ఓ ప్రీమియర్ లీగ్‌లో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ హ్యాట్రిక్ తీయడం ఇదే మొట్టమొదటిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జమైకా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. అనంతరం 169 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెజాన్ వారియర్స్ 17.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది.