
ముంబై: దేశవాళీ క్రికెట్ సీజన్‌ను కరోనా వైరస్ మహమ్మారి తుడిచిపెట్టుకుపోనుంది. దేశంలో వైరస్ విలయతాండవం రోజురోజుకి పెరిగిపోతోంది. క్రికెట్ మ్యాచ్‌ల గురించి పక్కన పెడితే.. కొందరు ఆటగాళ్లు కూడా ఇంట్లో నుండి బయటకు రాని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రస్తుత కరోనా సీజన్‌లో దేశవాళీ టోర్నీలను రెండుకే పరిమితం చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.
2020-21లో సీనియర్ క్రికెట్ ఆటగాళ్ల కోసం రంజీ ట్రోఫీ.. కుర్రాళ్ల కోసం అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీలను మాత్రమే బీసీసీఐ నిర్వహించనుంది. దులీప్ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, విజయ్ హజారె ట్రోఫీ, సీకే నాయుడు టోర్నీలు జరగవు. అయితే వీలును బట్టి ముస్తాక్ అలీ టీ20 టోర్నీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ ఏడాదికి మాత్రం రంజీ ట్రోఫీని గతంలోలా జోన్ల విధానంలో నిర్వహించే అవకాశముంది. ఈ పద్ధతిలో నార్త్, వెస్ట్, సౌత్, ఈస్ట్, సెంట్రల్ జోన్ స్థాయిల్లో అంతర్గత మ్యాచ్‌లు జరుగుతాయి. జోన్ విజేతలు ఆ తర్వాత నాకౌట్లో తలపడతాయి.
'కరోనా వైరస్ కారణంగా రంజీ ట్రోఫీ, అండర్-19 వినూ మన్కడ్ ట్రోఫీలను మాత్రమే నిర్బహించాలని ప్లాన్ చేశాం. వీలును బట్టి ముస్తాక్ అలీ టీ20 టోర్నీకి అవకాశం ఉంది. క్రికెటర్లు ఐపీఎల్ టోర్నీలో సంపాదించినంతగా.. ఇతర దేశీయ టోర్నమెంట్లలో సంపాదించరు. రంజీ అత్యధిక పారితోషికం తీసుకునే రెండవ టోర్నమెంట్. ఆటగాళ్లు ఒక రంజీ సీజన్‌కు 10-12 లక్షల లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. కొన్ని రాష్ట్ర సంఘాలు కూడా స్పాన్సర్‌షిప్ డబ్బును పంచుకుంటాయి. రంజీ చాలా మంది క్రికెటర్లకు జీవనోపాధి. అందుకే రంజీ ట్రోఫీ జరగడం చాలా ముఖ్యం' అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి అన్నారు.
మరోవైపుభారత మాజీ వికెట్ కీపర్, బీసీసీఐ క్రికెట్ వ్యవహారాల జనరల్ మేనేజర్ సబా కరీం తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరీం తన రాజీనామా లేఖను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాకు ఆదివారం పంపారు. కరీం సిద్ధం చేసిన దేశవాళీ క్రికెట్ ప్రణాళికల పట్ల సంతృప్తి చెందకపోవడం వల్లే అతణ్ని తప్పించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలిసింది. ఇటీవల బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన పదవికి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐలో కొత్త ప్రొఫెషనల్స్ టీమ్ రాబోతుందనే చర్చ మొదలైంది.