రంజీ ట్రోఫీలో మరో సంచలనం నమోదైంది. 200, 300 పరుగులు కాదు ఏకంగా 376 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా కరగదీసి ప్రపంచ రికార్డును క్రియేట్ చేశారు రంజీ బ్యాటర్లు. దీంతో సదరు జట్టు చరిత్రలోనే నిలిచిపోయే భారీ విజయాన్ని అందుకుంది.
తాజాగా ఒడిశాతో జరిగిన మ్యాచ్ లో సర్వీసెస్ టీమ్ ఈ ఘనత సాధించింది. సర్వీసెస్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లలో శుభం రోహిల్లా (270 బంతుల్లో 30 ఫోర్ల సాయంతో 209 నాటౌట్) ద్విశతకం బాదగా.. సూరజ్ వశిష్ట (246 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 154 నాటౌట్) శతకాన్ని బాదాడు. దీంతో 376 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సర్వీసెస్ జట్టు 85.4 ఓవర్లలో వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. ఫలితంగా ఒడిశాపై సర్వీసెస్ జట్టు విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ నాకౌట్ దశకు అర్హత సాధించలేకపోయింది.

సర్వీసెస్ ఖాతాలో పలు రికార్డులు
ఈ మ్యాచ్ విజయంతో సర్వీసెస్ జట్టు పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. రంజీ ట్రోఫీ చరిత్రలోనే వికెట్ నష్టపోకుండా అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా నిలిచింది. మొత్తంగా రంజీల్లో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా ఘనత సాధించింది. గతేడాది రైల్వేస్ టీమ్.. త్రిపురతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 378 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల నష్టంతో ఛేదించి అగ్రస్థానంలో నిలిచింది.
అలానే ఫోర్త్ హైయెస్ట్ ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా సర్వీసెస్ ప్రపంచ రికార్డును నెలకొల్పింది. గతంలో (1998-99 దేశవాళీ సీజన్ లో) పాకిస్థాన్ కు చెందిన సర్గోధా క్రికెట్ టీమ్.. లహోర్ సిటీ జట్టుపై ఫోర్త్ హైయెస్ట్ ఇన్నింగ్స్ లో వికెట్ కోల్పోకుండా 332 పరుగులు సాధించింది. ఇప్పుడా ఆల్ టైమ్ రికార్డును సర్వీసెస్ 376 పరుగులతో అధిగమించింది.