Ranji Trophy: కేరళ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ కు చేరుకుని చరిత్ర సృష్టించింది. 74 ఏళ్ల చరిత్రలో కేరళ రంజీ ట్రోఫీ ఫైనల్ చేరడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో కేరళ కేవలం రెండు పరుగుల ఆధిక్యంతో గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లింది. సెమీ ఫైనల్ లో కేరళ మొదటి ఇన్నింగ్స్ ఆధారంగా రెండు పరుగుల ఆధిక్యాన్ని సాధించి.. 74 ఏళ్లలో మొదటిసారి ఫైనల్ కు చేరుకుంది. అంతకు ముందు క్వార్టర్ ఫైనల్స్ లో కేరళ జమ్మూ కశ్మీర్ ను కేవలం ఒక పరుగు తేడాతో ఓడించింది. సెమీఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన కేరళ 457 పరుగులు చేయగా.. అనంతరం గుజరాత్ జట్టు 455 పరుగులకు ఆలౌట్ అయింది. రంజీ రూల్స్ ప్రకారం.. కేరళ సెమీస్ లో విజేత గా నిలిచి ఫైనల్ కు చేరుకుంది.
గుజరాత్ కేరళకు గట్టి పోటీని ఇచ్చినప్పటికీ.. ఆ జట్టును దురదృష్టం వెంటాడింది. కేరళపై ఆధిక్యాన్ని సాధించేందుకు కేవలం మూడు పరుగులు అవసరమైన నేపథ్యంలో గుజరాత్ ఆఖరి ఆటగాడు నగస్వల్లా అనూహ్యంగా ఔటయ్యాడు. నగస్వాల్లా కొట్టిన షాట్ షార్ట్ లెగ్ ఫీల్డర్ సల్మాన్ నిజార్ హెల్మెట్ కు తాకి స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న సచిన్ బేబీ చేతుల్లోకి వెళ్లింది. దీంతో నగస్వల్లా ఔటవ్వడంతో గుజరాత్ జట్టు ఒక్కసారిగా నైరాశ్యంలోకి వెళ్లింది. తాము ఫైనల్ లోకి వెళ్లిలేమనే విషయం తెలిసి గుజరాత్ ఆటగాళ్లు బాధపడ్డారు. కేవలం రెండు పరుగుల వల్ల గుజరాత్ కు ఫైనల్ బెర్త్ మిస్ అయ్యింది.

రంజీ ట్రోఫీలో కేరళను లక్కీ జట్టుగా చెప్పుకోవాలి. క్వార్టర్ ఫైనల్లోనూ కేవలం ఒక్క పరుగు ఆధిక్యంతో సెమీస్ కు చేరుకుంది. జమ్మూ కశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో కేరళ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ లో ఒక్క పరుగు లీడ్ ను సాధించింది. మ్యాచ్ డ్రా కావడంతో.. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ కారణంగా కేరళ జట్టు సెమీస్ లోకి ప్రవేశించింది.
సెమీస్ లో స్కోర్ల విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేరళ జట్టు... అజారుద్దీన్ 177 పరుగుల అద్భుతమైన సెంచరీతో 457 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. దీనికి ప్రతిస్పందనగా గుజరాత్ గట్టీ పోటీ ఇచ్చింది. గుజరాత్ తరఫున ప్రియాంక్ పంచల్ 148 పరుగులు చేయగా.. ఆర్య దేశాయ్ (73 ), జయమీత్ పటేల్(79) రాణించారు. అయితే కేరళ స్పిన్ ద్వయం ఆదిత్య సర్వాటే, జలజ్ సక్సేనాలు 8 వికెట్లు తీసి మ్యాచ్ ను తమ జట్టుకు అనుకూలంగా మార్చారు.