హుబ్లీ వేదికగా జమ్మూ కశ్మీర్, కర్ణాటక జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఆట రెండో రోజైన ఫిబ్రవరి 25న జమ్మూ కెప్టెన్ పారస్ డోగ్రా అత్యుత్సాహానికి పోయి కర్ణాటక ప్లేయర్ కేవీ అనీష్‌ను తలతో బలంగా కొట్టడం తీవ్రదుమారం రేపింది. టైటిల్ పోరులో ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్న సమయంలో జరిగిన ఈ ఘటన క్రీడా స్ఫూర్తికే విఘాతం కలిగించేలా ఉంది.

వివాదానికి దారితీసిన పరిస్థితులు
జమ్మూ కాశ్మీర్ ఇన్నింగ్స్ 101వ ఓవర్ వద్ద ఈ వివాదం మొదలైంది. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతి పారస్ డోగ్రా బ్యాట్‌కు తగిలి బౌండరీకి వెళ్లింది. ఆ సమయంలో ఫార్వర్డ్ షార్ట్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ కేవీ అనీష్‌తో పారస్ డోగ్రాకు మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన డోగ్రా.. అనీష్ దగ్గరికి వెళ్లి తలతో అతడి తలను బలంగా ఢీకొట్టాడు. దీంతో ఒక్కసారిగా మైదానంలో వాతావరణం వేడెక్కింది.

సీనియర్ల జోక్యం.. అంపైర్లకు ఫిర్యాదు
ఈ భౌతిక దాడిని చూసిన కర్ణాటక సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పారస్ డోగ్రా వైపు దూసుకెళ్లాడు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో అంపైర్లు మధ్యలో వచ్చి ప్లేయర్లను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా డోగ్రాతో మాట్లాడి పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. మరోవైపు కర్ణాటక కెప్టెన్ దేవదత్ పడిక్కల్ ఈ విషయంపై అంపైర్లకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు.
క్షమాపణలు తిరస్కరించిన అనీష్
ఓవర్ ముగిసిన తర్వాత డోగ్రా తన తప్పు తెలుసుకుని అనీష్ వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. అయితే పారస్ డోగ్రా చేసిన పనికి తీవ్రంగా నొచ్చుకున్న అనీష్, ఆ క్షమాపణలను స్వీకరించడానికి నిరాకరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, డోగ్రాపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఫైనల్ వంటి పెద్ద మ్యాచ్‌లో ఇలాంటి ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మ్యాచ్ పరిస్థితి పటిష్టం
వివాదం పక్కన పెడితే.. ఆట పరంగా జమ్మూ కాశ్మీర్ పటిష్ట స్థితిలో ఉంది. ఇప్పటికే ఆ జట్టు 142 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 469 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శుభమ్ పుండిర్ 121 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేయగా.. వివాదంలో నిలిచిన కెప్టెన్ పారస్ డోగ్రా 69 పరుగులతో క్రీజులో ఉన్నాడు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు తీసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు.