టీమిండియా సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా రంజీ ట్రోఫీలో సత్తాచాటుతున్నాడు. పరుగుల వరద పారిస్తూ అరుదైన రికార్డు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20వేల పరుగులు సాధించిన భారత నాలుగో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. ఎలైట్ గ్రూప్-ఏలో భాగంగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో పుజారా ఈ ఘనత సాధించాడు. 35 ఏళ్ల పుజారా రంజీట్రోఫీలో సౌరాష్ట్ర తరపున ఆడుతున్న విషయం తెలిసిందే.
ఇటీవల జార్ఖండ్‌పై పుజారా డబుల్ సెంచరీ సాధించాడు. అజేయంగా 243 పరుగులు చేశాడు. ఆ తర్వాత జరిగిన హర్యానా మ్యాచ్‌లోనూ 49, 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం జరుగుతున్న విదర్భపై రెండో ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేసి అరుదైన ఘనత అందుకున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 20వేల పరుగుల మార్క్‌ను ఇప్పటివరకు నలుగురు ప్లేయర్లే అందకున్నారు. సునీల్ గవాస్కర్ (25,834 పరుగులు), సచిన్ టెండూల్కర్ (25, 396), రాహుల్ ద్రవిడ్ (23, 794), పుజారా (20,013) మాత్రమే ఈ ఘనత సాధించారు.

కాగా, నాగ్‌పూర్ వేదికగా విదర్భతో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర 238 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న ఈ పిచ్‌పై సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు సాధించింది. హర్విక్ దేశాయ్ (68), పుజారా (43) పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్ నాలుగు వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన విదర్భ 78 పరుగులకు ఆలౌటైంది. జితేశ్ శర్మ (28) టాప్ స్కోరర్. చిరాగ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.
127 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్ ప్రారంభించిన సౌరాష్ట్ర 244 పరుగులు చేసింది. విశ్వరాజ్ (79), పుజారా (66), కెవిన్ (57) అర్ధశతకాలు బాదారు. అనంతరం ఛేదనలో విదర్భ 134 పరుగులకే ఆలౌటైంది. చిరాగ్ అయిదు వికెట్లతో సత్తాచాటాడు.