టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్నాడా? లేదా?.. గత కొద్ది రోజులుగా క్రికెట్ అభిమానులను తెగ ఊరిస్తోన్న విషయం. అయితే ఎట్టకేలకు విరాట్ రంజీ ఆడేందుకు సిద్ధమైపోయినట్లు స్పష్టత వచ్చింది. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించిన అతడు.. కచ్చితంగా రైల్వేస్ తో జరిగే మ్యాచ్ లో దిగుతాడని క్లారిటీ అయింది.
తాజాగా దిల్లీ క్రికెట్ సంఘం అధికారికంగా టీమ్ సభ్యుల పేర్లను ప్రకటించింది. ఆ జట్టులో కోహ్లీ కూడా ఉన్నాడు. ఈ జట్టుకు ఆయుష్ బదోని సారథిగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడతడు దిల్లీ టీమ్ తో కలిసి ప్రాక్టీస్ కూడా చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే కోహ్లీ.. టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పర్యవేక్షణలో ముంబయిలోని అలీబాగ్‌లో ప్రాక్టీస్ చేసిన సంగతి తెలిసిందే. స్క్వేర్ ఆఫ్ ది వికెట్ షాట్లను బాదడంతో పాటు బ్యాక్‌ఫుట్‌పై ఆడడంపై ఫుల్ ఫోకస్ పెట్టాడు.

" కోహ్లితో కలిసి ఆడబోతుండడం, డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోబోతుండటం.. దిల్లీ యంగ్ ప్లేయర్స్ కు ఓ మంచి అనుభవం అవుతుంది. మా జట్టులో విరాట్ కాకుండా నవ్‌దీప్ సైని ఒక్కడే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంకెవరూ కూడా నేషనల్ టీమ్ కు ఆడలేదు. ఇక వారు కోహ్లీ నుంచి నేర్చుకుంటారు. కోహ్లీ జట్టులోకి రావడం వల్ల భద్రతను భారీగా పెంచాం" అని దిల్లీ క్రికెట్ తెలిపింది.
ఈనెల 30న రైల్వేస్‌తో జరగబోయే మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడు. చివరిగా అతడు 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌పై రంజీ ఆడాడు.