మరి కొద్ది రోజులలో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ ఆడతాడా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. ప్రస్తుతం అతడు మెడ నొప్పితో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతడు రంజీ బరిలోకి దిగుతాడా లేదా అనే విషయమై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే విరాట్ రంజీ బరిలోకి దిగే విషయమై ఓ క్లారిటీ వచ్చేసింది.
నో కోహ్లీ
తాను రంజీ మ్యాచ్ ఆడలేనని బీసీసీఐకి విరాట్ కోహ్లీ తాజాగా సమాచారం ఇచ్చేసినట్లు తెలిసింది. ఇక ఇదే ఫైనల్ అని సమాచారం అందింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఆఖరి టెస్టు సందర్భంలోనే కోహ్లీకి మెడ పట్టేసిందట. దానికి ఇంజెక్షన్లు కూడా అతడు వాడుతున్నట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్‌తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం విరాట్ కు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంలో బీసీసీఐ ఉందట. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ ఆడటంపై ఇంకా స్పష్టత రాలేదు.

కేఎల్ రాహుల్ పరిస్థితేంటంటే
రంజీ మ్యాచ్‌లలో కేఎల్ రాహుల్ ఆడతాడని ఆ మధ్య ప్రచారం సాగింది. కర్ణాటక జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని క్రికెట్ వర్గాలు అన్నాయి. కానీ ఇప్పుడు అతడినీ గాయం వెంటాడుతోందని తెలిసింది. మోచేతి వద్ద నొప్పి ఉన్నందున్న తాను అందుబాటులో ఉండనని బీసీసీఐకి రాహుల్ చెప్పినట్లు సమాచారం అందింది. దీంతో పంజాబ్‌తో జరగబోయే మ్యాచ్‌కు రాహుల్ ను కర్ణాటక పక్కన పెట్టిందట.
ఇకపోతే శుభ్‌మన్ గిల్.. పంజాబ్ జట్టుతో రంజీ బరిలోకి దిగబోతున్నాడు. రవీంద్ర జడేజా కూడా సౌరాష్ట్ర తరఫున ఆడనున్నాడు. రిషభ్ పంత్ దిల్లీ జట్టుకు ప్రాతనిథ్యం వహిస్తున్నాడు. కాగా, జనవరి 23 నుంచి రంజీ ట్రోఫీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి. చూడాలి మరి వీరందరూ రంజీలో ఎలాంటి ప్రదర్శన చేస్తారో..