టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఇటీవలే ముంబయి రంజీ జట్టుతో కలిసి సాధన చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడు త్వరలోనే ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడా లేదా అని గత మూడు నాలుగు రోజులుగా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. అయితే ఎట్టకేలకు ఈ విషయంపై రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. ఏం చెప్పాడంటే
కెప్టెన్ రోహిత్ శర్మ గత కొద్ది రోజులుగా పేలవ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తాను ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 31 పరుగులు మాత్రమే చేశాడు రోహిత్. పేలవ ఫామ్ కారణంగా ఆఖరి టెస్టుకు దూరంగా కూడా ఉన్నాడు. ఇదే సమయంలో హిట్ మ్యాన్ తో పాటు ఇతర స్టార్ క్రికెటర్లు కూడా పరుగులు చేయలేక ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే బీసీసీఐ.. ఆటగాళ్లందరూ ఫామ్ అందిపుచ్చుకునేందుకు కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని నిబంధనను తీసుకొచ్చింది.

దీంతో రిషభ్ పంత్, శుభమన్ గిల్, యశస్వి జైశ్వాల్.. పలువురు క్రికెటర్లు రంజీ ట్రోఫీ కోసం సిద్ధమవుతున్నారు. విరాట్ కోహ్లీ మాత్రం మెడ నొప్పి కారణంగా అందుబాటులో ఉండడని తెలిసింది. ఇలా దాదాపుగా అందరి గురించి స్పష్టత వచ్చినప్పటికీ రోహిత్ రంజీ ఆడటంపై క్లారిటీ రాలేదు. అయితే ఎట్టకేలకు నేడు(జనవరి 18) ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు హిట్ మ్యాన్.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన కోసం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను రంజీలో అందుబాటులో ఉండే విషయంపై మాట్లాడాడు. 'నేను రంజీ ఆడతాను' అని స్పష్టత ఇచ్చాడు. కాగా, జమ్ముకశ్మీర్‌తో ముంబయి రంజీ మ్యాచ్ ఈ నెల 23న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ ఆడే అవకాశం ఉంది. రోహిత్ చివరగా 2015లో రంజీ మ్యాచ్ ఆడాడు.