టీమిండియా స్టార్ క్రికెటర్, శుభమన్ గిల్ ఎట్టకేలకు ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచిన అతడు.. ప్రస్తుతం రంజీ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. కర్ణాటక - పంజాబ్ మధ్య జరుగుతోన్న మ్యాచ్ లో భాగంగా మూడో రోజు ఆటలో సెంచరీతో మెరిశాడు.
తొలి ఇన్నింగ్స్ లో నిరాశ
అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో గిల్ నిరాశే ఎదురైంది. దీంతో మరోసారి అతడిపై విమర్శలు వచ్చాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం నాలుగు పరుగులే చేసి ఔటయ్యాడు. కర్ణాటక పేసర్ అభిలాష్ శెట్టి బౌలింగ్‌లో క్రిష్ణన్ శ్రీజిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గిల్‌తో పాటు మిగతా పంజాబ్ బ్యాటర్లు కూడా విఫలమవ్వడంతో తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే పంజాబ్ జట్టు ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ
అయితే ఈ క్రమంలోనే రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునేందుకు గిల్ విజృంభించాడు. 159 బంతుల్లో వంద పరుగుల మార్క్ ను టచ్ చేశాడు. 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి ఆడాడు. మొత్తంగా 171 బంతుల్లో 102 పరుగులు సాధించాడు. కానీ మిగతా వాళ్ల నుంచి మాత్రం సహకారం అందలేదు. దీంతో గిల్ పోరాటం వృథా అయింది. పంజాబ్ జట్టు 213 పరుగులకు ఆలౌట్ అయింది. కర్ణాటక చేతిలో ఇన్నింగ్స్ 207 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది.
స్మరణ్ డబుల్ సెంచరీ
కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్ లో రవిచంద్రన్ స్మరణ్ (277 బంతుల్లో 203; 25 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీతో విజృంభించాడు.దీంతో ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 475 పరుగులు చేసింది.