టీమిండియా క్రికెట్‌లో ఫిట్‌నెస్ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు విరాట్ కోహ్లీ! క్రీజులో ఎక్కువ సేపు నిలబడాలంటే ఎంతో ఫిట్‌నెస్ అవసరం. దీనిలో డైట్‌దే కీలక పాత్ర ఉంటుంది. అందుకే కోహ్లీ మ్యాచులు ఆడేటప్పుడు ప్రత్యేకమైన డైట్‌ను ఫాలో అవుతుంటాడు.
అయితే ఇప్పుడతడు దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై దేశవాళీ క్రికెట్ రంజీ బరిలోకి దిగాడు. రైల్వేస్ జట్టుతో ఆడుతున్నాడు. దీంతో అతడు ఈ మ్యాచ్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అని వేలాది క్రికెట్ అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. ఇదే సమయంలో మ్యాచ్ లో మెరుగ్గా రాణించాలని విరాట్ కూడా తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు.

ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం కోహ్లీ పాటించిన డైట్ వివరాలు బయట చక్కర్లు కొడుతున్నాయి. మ్యాచ్ తొలి రోజు మధ్యాహ్నా భోజనం కోసం ఆహారంగా ఏం తీసుకుంటున్నాడో తెలిసింది. దిల్లీ క్రికెట్ అసోషియేషన్ చెఫ్ సంజయ్ ఈ విషయం చెప్పారు. విరాట్ కదాయి దాల్, చిల్లీ పన్నీర్ వంటివి తిన్నట్లు తెలిపారు.
"మొదట్లో అతడు వయసులో ఉన్నప్పుడు చికెన్ చిల్ బాగా తినడానికి ఇష్టపడేవాడు. కానీ ఈరోజు(జనవరి 30) అతడు లంచ్ కోసం చిల్లీ పన్నీర్ వండమని రిక్వెస్ట్ చేశాడు. నిన్న ట్రైనింగ్ సెషన్ పూర్తయ్యాక అతడు పర్సనల్ గా నన్ను కలిసి చిల్లీ పన్నీర్ వండమని రిక్వెస్ట్ చేశాడు. గత రెండు రోజులు ప్రాక్టీస్ సెషన్ అయ్యాక కాది చావల్ వండమని అడిగాడు. నన్ను అతడు సంజయ్ జి అని పిలుస్తాడు. అతడు ఉన్నత స్థాయికి ఎదిగినప్పుటికీ ఇంకా నా పేరు గుర్తు పెట్టుకున్నాడు." అని సంజయ్ వెల్లడించారు.
16 నుంచి 27 వేల మంది
'ఏంటయ్యా ఇది.. ఒక మనిషిని ఇంతలా ఆరాధిస్తారా?'... ఈ డైలాగ్ చాలా మంది తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటుంది. ఠాగూర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఓ పోలీస్ ఆఫీసర్ అంటారు.ఇప్పుడిదీ కోహ్లీని ఉద్దేశించి మరోసారి వినిపిస్తోన్న మాట ఇది. ఎందుకంటే ఇప్పుడు కోహ్లీ రంజీ మ్యాచ్ చూసేందుకు.. మైదానానికి అశేష స్థాయిలో అభిమానులు భారీగా తరలి వచ్చారు. స్కూల్ పిల్లల నుంచి యువకులు, పెద్దల వరకు, కదిలొచ్చిన అభిమాన సంద్రంతో అరుణ్ జైట్లీ స్టేడియం మోత మోగిపోయింది. ఇంతమంది ఫ్యాన్స్ కదిలి రావడంతో స్వల్ప తోపులాట కూడా చోటు చేసుకుంది. ఫ్యాన్స్ ఒకరినొకరు నెట్టుకోవడంతో పలువురు కింద పడిపోయారు. చాలా మంది షూలు, చెప్పులను వదిలేసి మరీ పరిగెత్తుతూ స్టేడియాల్లోకి వెళ్లారు. ఓ ముగ్గురు గాయపడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా కోహ్లీ మ్యాచ్ కోసం దాదాపుగా 27 వేల మంది వరకు ప్రేక్షకులు హాజరైనట్లు తెలిసింది.