

హైదరాబాద్: రాజ్‌కోట్ వేదికగా రైల్వేస్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో సౌరాష్ట్ర తరుపున ఆడుతోన్న రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీయడంతో పాటు (178 బ్యాటింగ్; 326 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సులు) సెంచరీ సాధించాడు.
ఫలితంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రవీంద్ర జడేజా బ్యాటింగ్ యావరేజి 523.5గా నమోదైంది. రెండో రోజు ఆటలో భాగంగా ఓవర్‌నైట్ స్కోరు 82/4తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర జట్టును రవీంద్ర జడేజా నడిపించాడు. షా (25), మన్కడ్ (28)తో కలిసి జడేజా అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు.
కమలేష్ మక్వానా (62 బ్యాటింగ్)తో కలిసి జడేజా తొమ్మిదో వికెట్‌కు 171 పరుగులు జత చేశాడు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 344 పరుగులతో నిలిచింది. రైల్వేస్ జట్టు బౌలర్ అవినాష్ యాదవ్ 95 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సౌరాష్ట్రకు 144 పరుగుల ఆధిక్యం లభించింది.
అంతకముందు రైల్వేస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే ఆలౌటైంది.