హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్‌కు బరోడా క్రికెట్ సంఘం ఊహించని షాకిచ్చింది. రంజీ సీజన్ ఆరంభంలో బరోడా జట్టుకు నాయకత్వం వహించిన ఇర్ఫాన్ పఠాన్‌ను ఇప్పుడు జట్టు నుంచి తప్పించింది.
త్రిపురతో జరగబోయే రంజీ మ్యాచ్ నుంచి పఠాన్‌ను తప్పిస్తున్నామని, అతడి స్ధానంలో కెప్టెన్సీ పగ్గాలను దీపక్ హుడాకు అప్పగిస్తున్నామని బరోడా క్రికెట్ సంఘం పేర్కొంది. ఇర్ఫాన్ పఠాన్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి బరోడా జట్టు ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా తయారైంది.

ప్రస్తుత రంజీ సీజన్‌లో బరోడా జట్టు గ్రూప్-సిలో అట్టడుగున నిలిచింది. మరోవైపు ఇటీవల జరిగిన మ్యాచ్‌లో 80 పరుగులు సాధించిన తిరిగి జట్టులో చోటు దక్కించుకుంటానన్న విశ్వాసం వ్యక్తం చేశాడు. పఠాన్ తొలగింపుపై బరోడా క్రికెట్ సంఘం ఈ విధంగా స్పందించింది.
'ఇది సీజన్ ఆరంభమే. పఠాన్ తొలగింపుపై సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్తవారితో ప్రయోగాలు చేసే ఉద్దేశంతోనే నాయకత్వంలో మార్పు చేశాం. మా నిర్ణయం ఏమాత్రం తప్పుకాదు' అని బరోడా క్రికెట్ సంఘం కార్యదర్శి స్నేహల్ పారిఖ్ పేర్కొన్నాడు.
అయితే తనను తప్పించడంపట్ల ఇర్ఫాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'ఫిట్‌నెస్ సమస్యలు లేవు. ఇది క్రమశిక్షణా చర్య ఎంతమాత్రం కాదు. ఈ నిర్ణయం వెనుక కారణం తెలియరావడం లేదు. ఈ పరిస్థితి ఎంతోకాలం కొనసాగదు' అని ఇర్ఫాన్ తెలిపాడు.